Delhi: కరోనా నుంచి కోలుకున్న మహిళా డాక్టర్ ను బంధించిన పక్కింటి వ్యక్తి!

Delhi Doctor Who Recovered From Coronavirus Locked Up At Home By Neighbour

  • ఢిల్లీలో చోటు చేసుకున్న ఘోరం
  • కరోనా పేషెంట్ అని దూషించిన పొరుగింటి వ్యక్తి
  • నెగెటివ్ వచ్చిన రిపోర్టు చూపించినా వినని వైనం

కరోనా వైరస్ నుంచి కోలుకున్న మహిళా డాక్టర్ ను పక్కింటి వ్యక్తి బంధించిన ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది. ఫ్లాట్ లో బంధించడమే కాకుండా, దుర్భాషలాడుతూ హింసించాడు. వివరాల్లోకి వెళ్తే, సదరు మహిళా డాక్టర్ ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేస్తున్నారు. కరోనా పేషెంట్లకు చికిత్స చేస్తున్న క్రమంలో ఆమె కూడా మహమ్మరి బారిన పడ్డారు. దీంతో ఆమెను ఆసుప్రతిలో చేర్పించి చికిత్స అందించారు. వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఆసుప్రతి నుంచి డిశ్చార్జి చేశారు. హోం క్వారంటైన్లో ఉండాలని సూచించారు. దీంతో, ఆమె వసంత్ కుంజ్ లోని తన నివాసానికి చేరుకున్నారు.

గత బుధవారం సాయంత్రం 4.30 గంటలకు పొరుగింట్లో ఉండే మనీశ్ అనే వ్యక్తి వచ్చి ఆమెను దుర్భాషలాడాడు. కరోనా పేషెంట్ అని తిడుతూ, వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోవాలని ఒత్తిడి చేశాడు. తాను కరోనా నుంచి బయటపడ్డానంటూ, అందుకు సంబంధించిన నెగెటివ్ రిపోర్టులు చూపించినా... అతను వినలేదు. నీవు అసలు బయటకు ఎలా వెళ్తావో చూస్తానంటూ... ఆమెను ఇంట్లోనే ఉంచి, బయట నుంచి తాళం వేసేశాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. దేశ వ్యాప్తంగా వైద్య సిబ్బందిపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే. కొన్ని ప్రాంతాల్లో పోలీసులపై కూడా దాడులు జరిగాయి.

  • Loading...

More Telugu News