Hyderabad: హైదరాబాదులో కుమ్మేసిన వర్షం!
- హైదరాబాదులోని పలు ప్రాంతాలు జలమయం
- ఈదురుగాలులకు విరిగిపడిన చెట్ల కొమ్మలు
- క్యుములో నింబస్ మేఘాలే కారణమన్న వాతావరణ విభాగం
హైదరాబాదులోని పలు ప్రాంతాల్లో ఈ సాయంత్రం భారీ వర్షం కురిసింది. ఎండలతో సతమతమవుతున్న నగరజీవికి ఈ వర్షం ఎంతో ఆహ్లాదాన్నిచ్చింది. అయితే పలు ప్రాంతాల్లో భారీగా ఈదురుగాలులు వీయడంతో చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి.
కొత్తపేట, సరూర్ నగర్, ఖైరతాబాద్, కాచిగూడ, నల్లకుంట, మెహదీపట్నం, అబిడ్స్, బషీర్ బాగ్, సోమాజిగూడ, చంపాపేట, సైదాబాద్, మలక్ పేట, అంబర్ పేట, కోఠి, అబిడ్స్, హిమాయత్ నగర్, బేగం బజార్ తదితర ప్రాంతాల్లో భారీ వర్షం కురియడంతో రోడ్లపైకి నీళ్లు చేరాయి. ఈ వర్షాలకు తుపానుతో సంబంధం లేదని, అక్కడికక్కడే ఏర్పడే క్యుములో నింబస్ మేఘాలే కారణమని స్థానిక వాతావరణ కేంద్రం పేర్కొంది. అటు, తెలంగాణలోని పలు జిల్లాల్లోనూ వర్షపాతం నమోదైనట్టు తెలిసింది.