Sachin Tendulkar: ఆరోజు అంపైర్ భయపడ్డాడు... అందుకే సచిన్ డబుల్ సెంచరీ: డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు
- 2010లో సచిన్ డబుల్ సెంచరీ
- 190 దాటిన తరువాత ఎల్బీ చేశాను
- ఫ్యాన్స్ స్టేడియం దాటనివ్వబోరన్నట్టు చూశాడన్న స్టెయిన్
వన్డే క్రికెట్ చరిత్రలో తొలిసారిగా సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ చేసిన క్షణాలను ఎవ్వరూ మరచిపోరు. నాటి సచిన్ స్కోరు, ఆపై ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచింది. 2010లో దక్షిణాఫ్రికాతో గ్వాలియర్ లో జరిగిన మ్యాచ్ లో 147 బంతుల్లో 200 పరుగులు చేసిన సచిన్, నాటౌట్ గా నిలువగా, భారత్ 401 పరుగుల భారీ స్కోరు చేసింది. ఛేజింగ్ కు దిగిన సౌతాఫ్రికా 153 పరుగులకే పరిమితమైంది.
నాటి సచిన్ డబుల్ సెంచరీపై దక్షిణాఫ్రికా తరఫున అదే మ్యాచ్ లో ఆడిన డేల్ స్టెయిన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. సచిన్ స్కోరు 190 పరుగులు దాటిన తరువాత, తన బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూ అయ్యాడని, తాను అపీల్ చేయగా, అంపైర్ స్థానంలో ఉన్న ఇయాన్ గౌల్డ్, దాన్ని అవుట్ గా ఇవ్వలేదని చెప్పాడు. అప్పుడు తాను ఇయాన్ వైపు చూడగా, అతని ముఖంలో భయం కనిపించిందన్నాడు. అవుట్ అయితే, నాటౌట్ అని ఎందుకు ప్రకటించారన్నట్టు ప్రశ్నార్థకంగా చూస్తే, అతనేమో చుట్టూ ఉన్న జనాలను చూశావా? ఈ సమయంలో అవుట్ ఇస్తే, నేను హోటల్ కు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు అన్నట్టు దీనంగా ముఖం పెట్టుకున్నాడని చెప్పాడు.
ఇదే సమయంలో సచిన్ ఆటతీరును ప్రశంసిస్తూ, అంతర్జాతీయ క్రికెట్ లో సచిన్ అన్ని రికార్డులనూ కొల్లగొట్టాడని, క్రికెట్ పుస్తకంలోని అన్ని షాట్లూ సచిన్ కు మాత్రమే సొంతమని అన్నాడు. సచిన్ అంత త్వరగా ఎల్బీడబ్లూ కాబోరని చెప్పాడు.