Srisailam: ఏపీ సర్కార్ కు షాక్... పోతిరెడ్డిపాడుపై కృష్ణా బోర్డుకు కేంద్రం సూచనలు!
- వెంటనే యాజమాన్య బోర్డు సమావేశానికి సిఫార్సు
- అంతవరకూ తుది నిర్ణయం తీసుకోవద్దని సూచన
- కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షకావత్
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా మరింత నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం నిర్ణయించుకున్న నేపథ్యంలో, ఏపీ, తెలంగాణల మధ్య జలజగడం ప్రారంభం కాగా, ఈ పథకంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు చర్చించాలని కేంద్ర జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఏపీ పునర్విభజన చట్టంలోని నిబంధనలను పరిశీలించి, ప్రాజెక్టుల డీపీఆర్ నిబంధనల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలని సూచించినట్టు తెలిపారు.
కాగా, ఈ విషయంలో తెలంగాణ నీటి పారుదల శాఖ చీఫ్ సెక్రెటరీ రాసిన లేఖపై ఇప్పటికే ఏపీ నుంచి యాజమాన్య బోర్డు వివరణ కోరగా, తాజాగా గజేంద్ర సింగ్ షెకావత్ చేసిన సూచనలపై సోమవారం నాడు ఏపీ ప్రభుత్వం చర్చించి, స్పందించే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
కాగా, ఈ ప్రాజెక్టును అడ్డుకోవాలని, సమగ్ర ప్రాజెక్టు నివేదికలను పరిశీలించేంత వరకూ ఏపీ ప్రభుత్వం ముందుకు వెళ్లకుండా చూడాలని కోరినట్టు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కు రాసిన లేఖలో షెకావత్ పేర్కొన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని వెంటనే ఏర్పాటు చేసేందుకు జల్ శక్తి మంత్రిత్వ శాఖ అధికారులను చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు కూడా ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రోజుకు 3 టీఎంసీల నీటిని తీసుకెళ్లేలా శ్రీశైలం కుడిగట్టు కాలువ సామర్థ్యాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచాలని ఏపీ నిర్ణయం తీసుకోగా, తమ ప్రయోజనాలు దెబ్బతింటాయని తెలంగాణ సర్కారు తీవ్ర అభ్యంతరాలను వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.