Who: వీధుల్లో చల్లే రసాయనాలతో కరోనా పోదు... ప్రజల ఆరోగ్యానికి ప్రమాదమన్న డబ్ల్యూహెచ్ఓ!
- రసాయనాలను చల్లడం ద్వారా కరోనా వైరస్ అంతం కాదు
- రోగుల నోటి తుంపర్లలోని వైరస్ కూడా నాశనం కాదు
- ఫుట్ పాత్ లు, వీధులు వైరస్ ఆశ్రయ ప్రాంతాలు కాదు
- వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక ప్రకటన
కరోనా క్రిములను అంతం చేసేందుకు పలు దేశాల్లో సోడియం హైపోక్లోరైడ్ ను వీధుల్లోనూ, భవంతులపైనా చల్లుతున్న నేపథ్యంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కీలక వ్యాఖ్యలు చేసింది. రసాయనాలను చల్లడం ద్వారా కరోనా వైరస్ అంతం కాదని, పైగా ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని హెచ్చరించింది.
ఉపరితలాలను పరిశుభ్రం చేయడం, క్రిమిరహితం చేయడంపై ప్రస్తుతం పాటిస్తున్న విధానాలపై ఓ డాక్యుమెంట్ ను డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసింది. "వీధులు, మార్కెట్లు తదితర ఔట్ డోర్ ప్రాంతాల్లో లో రసాయనాలు చల్లడం, పొగ పెట్టడం వంటి చర్యలను మేము సిఫార్సు చేయబోము. ఇది కొవిడ్-19 వైరస్ ను ఇతర పాథోజన్ లను సంహరించదు" అని వెల్లడించింది.
వీధులు, ఫుట్ పాత్ లు కరోనా వైరస్ కు ఆశ్రయం కల్పించే ప్రాంతాలేమీ కాదని, క్రిమిరహితం పేరిట రసాయనాలు చల్లడం వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని పేర్కొంది. రసాయనాలు చల్లడం వల్ల రోగి నోటి నుంచి వచ్చే తుంపరల్లో ఉండే క్రిములు కూడా నాశనం కాబోవని తేల్చి చెప్పింది.