Lockdown 4.0: మే 31 వరకూ లాక్ డౌన్ పొడిగింపు... నేడు అధికారిక ప్రకటన!
- కనీసం రెండు వారాల పాటు పొడిగింపు
- నిబంధనల్లో మరిన్ని సడలింపులు కూడా
- తెరచుకోనున్న రెస్టారెంట్లు, మాల్స్
నేటితో లాక్ డౌన్ 3.0 ముగియనుండగా, మరో పొడిగింపునకు రంగం సిద్ధమైంది. కనీసం రెండు వారాల పాటు లాక్ డౌన్ ను పొడిగిస్తూ, ఈ నెల 31 వరకూ కొనసాగించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ పొడిగింపుపై నేడు కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయనుంది. ఇదే సమయంలో ప్రస్తుతం అమలవుతున్న నిబంధనల్లో మరిన్ని సడలింపులు కూడా ఉంటాయని సమాచారం. రెస్టారెంట్లు, షాపింగ్ మాల్స్ తిరిగి తెరచుకునే అవకాశాలున్నాయని కేంద్ర వర్గాలు వెల్లడించాయి. కొన్ని నిబంధనలను పాటిస్తూ, ప్రజా రవాణాకు కూడా గేట్లు ఎత్తేయవచ్చని తెలుస్తోంది.
దేశవాళీ విమాన ప్రయాణాలకు కూడా పచ్చజెండా ఊపవచ్చని, అయితే, విమానం బయలుదేరే ప్రాంతం, గమ్యస్థానం ఉన్న ప్రభుత్వాల మధ్య కుదిరే అంగీకారం మేరకే టేకాఫ్ లు ఉండాలని నిబంధన విధించే అవకాశాలు ఉన్నాయి. నగరాల్లో కేసుల సంఖ్య అధికంగా ఉన్నందున మెట్రో రైల్ సేవలను పునఃప్రారంభించే విషయమై ఇప్పట్లో నిర్ణయించే వీలు కనిపించడం లేదు.
రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి వచ్చిన సూచనలు, నివేదికల మేరకు ఇప్పటికే హోమ్ శాఖ లాక్ డౌన్ 4.0పై విధివిధానాలను సిద్ధం చేసినట్టు సమాచారం. గ్రీన్, ఆరంజ్ జోన్లలో ఆటో రిక్షాలు, క్యాబ్ సర్వీసులు, ఈ-కామర్స్ సంస్థల ద్వారా అత్యవసరం కాని వస్తువుల డెలివరీకి అంగీకరించాలని ప్రభుత్వం నిశ్చయించినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి.
కాగా, ఇండియాలో మార్చి 25న తొలి విడత లాక్ డౌన్ ను ప్రకటించగా, ఆపై దాన్ని ఏప్రిల్ 15న ఒకసారి, మే 4న రెండోసారి పొడిగించిన సంగతి తెలిసిందే. మే 17తో ఆ సమయం ముగియగా, కేసుల సంఖ్య ఇంకా అదుపులోకి రాకపోవడంతో మరోసారి లాక్ డౌన్ ను రెండు వారాల పాటు పొడిగించాలని పలు రాష్ట్రాలు కేంద్రానికి విజ్ఞప్తి చేశాయి. ఇదే సమయంలో ఆర్థిక వృద్ధి కుంటుపడిన నేపథ్యంలో సడలింపులనూ పెంచాలని కోరాయి.