Nirmala Sitharaman: విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ కీలక ప్రకటనలు
- విద్యా రంగంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం
- విద్యా రంగం కోసం మరో 12 స్వయం ప్రభ ఛానళ్లు
- ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ఛానల్
- ఆన్‌లైన్ కోర్సుల కోసం వర్సిటీలకు ఆటోమేటిక్ విధానం అనుమతులు
కరోనా విజృంభణతో విధించిన లాక్‌డౌన్ వల్ల విద్యార్థులకు చదువు విషయంలో ఇబ్బందులు తలెత్తకుండా నిర్మలా సీతారామన్ పలు అంశాలపై కీలక ప్రకటనలు చేశారు. విద్యా రంగంలో ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌కు భారీ ఎత్తున ప్రోత్సాహం అందిస్తామన్నారు.
విద్యా రంగం కోసం మరో 12 స్వయం ప్రభ ఛానళ్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు. బధిర విద్యార్థుల కోసం ప్రత్యేక ఛానల్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం ఉన్న మూడు విద్యా రంగ ఛానెళ్లకు అదనంగా వీటిని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థుల కోసం కరిక్యులమ్, ఆన్‌లైన్ కరిక్యులమ్ సదుపాయాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే, ఇతర విద్యార్థులకు ఆన్‌లైన్ కోర్సుల కోసం 100 ప్రధాన యూనివర్సిటీలకు ఆటోమేటిక్ విధానంలో అనుమతులు ఇస్తామని చెప్పారు.
విద్యార్థులకు, ఉపాధ్యాయులకు మధ్య పరస్పర సంభాషణకు ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. ఇందుకోసం సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకొస్తామని ప్రకటించారు. కమ్యూనిటీ రేడియోలతో పాటు బ్రాడ్‌కాస్ట్ విధానంలో పిల్లలకు విద్యా బోధన చేస్తామని తెలిపారు. ఒకటో తరగతి నుంచి 12వ తరగతి వరకు ప్రతి తరగతికి ఒక ఛానల్ ఉంటుందని కీలక ప్రకటన చేశారు.
కరోనా విజృంభణ నేపథ్యంలో ప్రజలను భయాకందోళనల నుంచి దూరం చేసేందుకు సైకలాజికల్ కౌన్సెలింగ్ తరగతులు ఇప్పిస్తామని తెలిపారు. పిల్లలు, ఉపాధ్యాయులతో పాటు కుటుంబాలకు కూడా కౌన్సెలింగ్ అందేందుకు ప్రోత్సహిస్తామని తెలిపారు.