Maharashtra: ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ పొడిగించిన తమిళనాడు, మహారాష్ట్ర
- ఇప్పటికే పొడిగించిన పంజాబ్
- కేంద్రం విధించిన మూడో విడత లాక్ డౌన్ కు నేడు చివరిరోజు
- ఇప్పటికీ అదుపులోకి రాని కరోనా
దేశంలో కరోనా తీవ్రత అంతకంతకు పెరుగుతోంది. తాజాగా ఒక్కరోజే 4 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో, కేంద్రం ప్రకటించిన మూడో విడత లాక్ డౌన్ నేటితో ముగియనుంది. కరోనా ఉద్ధృతి దృష్ట్యా కేంద్రం కూడా నాలుగో విడత లాక్ డౌన్ ను ఈ నెల 31 వరకు పొడిగిస్తుందన్న ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే, కేంద్రం ప్రకటన రాకముందే అనేక రాష్ట్రాలు లాక్ డౌన్ పొడిగించాయి.
ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగిస్తున్నట్టు ఇప్పటికే పంజాబ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, తాజాగా మహారాష్ట్ర, తమిళనాడు కూడా అదే బాటలో నడిచాయి. ఈ నెలాఖరు వరకు లాక్ డౌన్ అమల్లో ఉంటుందని ప్రకటించాయి. భారత్ లో కరోనా ప్రభావం అత్యధికంగా చవిచూస్తున్న రాష్ట్రం మహారాష్ట్ర. అక్కడ 30,706 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 1,135 మంది మృత్యువాత పడ్డారు. ఈ పరిస్థితుల్లో లాక్ డౌన్ ను మరింత పొడిగించాలంటూ సీఎం ఉద్ధవ్ థాకరే ప్రధాని మోదీకి లేఖ కూడా రాశారు. అయితే లోకల్ రైళ్ల వంటి పలు సడలింపులు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేశారు.
ఇక తమిళనాడు కూడా లాక్ డౌన్ ను మే 31 వరకు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. తమిళనాడులో ఇప్పటివరకు 10,585 కేసులు నమోదయ్యాయి. 74 మంది కరోనాతో చనిపోయారు. దేశంలోని అత్యధిక రాష్ట్రాలు లాక్ డౌన్ కొనసాగించాల్సిందేనని కోరుకుంటున్నాయి. అయితే ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించని రీతిలో కొన్ని సడలింపులు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.