Harish Rao: వైజాగ్ ఘటనతో అప్రమత్తమయ్యాం: మంత్రి హరీశ్ రావు
- సేఫ్టీ అధికారులు సరిగా పని చేయడం లేదు
- గత ఏడాది ప్రమాదాల్లో 20 మంది చనిపోయారు
- కరోనా జాగ్రత్తలను కచ్చితంగా పాటించాలి
వైజాగ్ లో ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన ఘటన పెను విషాదాన్ని మిగిల్చింది. 12 మంది ప్రాణాలు కోల్పోగా, అనేక మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో, తెలంగాణ రాష్ట్రంలోని పరిశ్రమల యజమానులు, అధికారులతో మంత్రి హరీశ్ రావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చూసీచూడనట్టు అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అనంతరం మీడియాతో మాట్లాడుతూ, వైజాగ్ ఘటనతో తాము కూడా అప్రమత్తమయ్యామని చెప్పారు. బాయిలర్, ఫైర్, సేఫ్టీ అధికారులు పరిశ్రమలను సరిగా చెక్ చేయడం లేదని అన్నారు. వివిధ పరిశ్రమల్లో చోటు చేసుకున్న ప్రమాదాల్లో గత ఏడాది 20 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
బాయిలర్, గ్యాస్ వదిలేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రి పూట విషవాయువులు వదులుతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని అన్నారు. సేఫ్టీ ఆఫీసర్స్ విధులు సక్రమంగా నిర్వహించడం లేదని చెప్పారు. బస్సుల్లో కనీస దూరం పాటించకుండా యాజమాన్యాలు కార్మికులను తరలిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కంపెనీలన్నీ కరోనా జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హరీశ్ రావు హెచ్చరించారు.