Jagan: ఎల్జీ పాలిమర్స్ కంపెనీకి సంబంధించి మేం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదు: సీఎం జగన్ స్పష్టీకరణ
- గత ప్రభుత్వ హయాంలోనే అనుమతులిచ్చారన్న సీఎం
- తాము రాజకీయ ఆరోపణలు చేయడంలేదని వివరణ
- ఎల్జీ పాలిమర్స్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్
విశాఖపట్నంలో తీవ్ర విషాదానికి కారణమైన ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ ఘటనపై సీఎం జగన్ స్పందించారు. ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమకు తమ ప్రభుత్వం ఒక్క అనుమతి కూడా ఇవ్వలేదని, ఆ సంస్థకు గత ప్రభుత్వమే అన్ని అనుమతులు ఇచ్చిందని వెల్లడించారు.
అసలు రాష్ట్రంలో ఆ సంస్థకు అనుమతి కానీ, విస్తరణకు ఆమోదం కానీ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే జరిగాయని, అయినా తాము రాజకీయంగా ఎక్కడా ఆరోపణలు చేయలేదని వివరించారు. మానవతా దృక్పథంతో బాధితులను ఆదుకునేందుకు ప్రయత్నించామని చెప్పారు.
గతంలో ఓఎన్జీసీ గ్యాస్ లీకై 22 మంది చనిపోయినప్పుడు తాను కోటి రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశానని, ఇప్పుడు ఎల్జీ పాలిమర్స్ ఘటన సందర్భంగా ఆనాటి విషయాన్ని మదిలో ఉంచుకుని రూ.కోటి ఎక్స్ గ్రేషియా ప్రకటించామని సీఎం జగన్ తెలిపారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీక్ బాధితులతో వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి ఒక్క క్లిక్కుతో.. గ్యాస్ లీకేజ్ బాధితులైన 20 వేల మంది బ్యాంకు ఖాతాలలో 10 వేల రూపాయల చొప్పున పరిహారాన్ని జమ చేశారు.