China: ఎట్టకేలకు కరోనాపై దర్యాప్తుకు ఒప్పుకున్న చైనా
- దర్యాప్తుకు చైనా ముందుకు రావాలని ఈయూ తీర్మానం
- మద్దతు పలికిన 100కు పైగా దేశాలు
- ముందు నుంచి ఎంతో బాధ్యతగా వ్యవహరించామన్న జిన్ పింగ్
చైనాలోని ల్యాబ్ లోనే కరోనా వైరస్ పుట్టిందని పలు దేశాలు ఆరోపిస్తున్నాయి. వాస్తవాలు వెలుగులోకి రావాలని డిమాండ్ చేస్తున్నాయి. మరోవైపు ఈ ఆరోపణలను చైనా ఖండిస్తోంది. ఈ పరిణామాలన్నింటి నేపథ్యంలో కరోనా వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జరిగే దర్యాప్తుకు చైనా అంగీకరించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ సందర్భంగా చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ మాట్లాడుతూ, ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిపై ప్రభావం చూపిన కరోనా బయటపడినప్పుడు చైనా ఎంతో బాధ్యతతో వ్యవహరించిందని చెప్పారు. ప్రతి విషయాన్ని ఎప్పటికప్పుడు తాము బహిరంగంగా పంచుకున్నామని అన్నారు.
కరోనాపై దర్యాప్తుకు చైనా ముందుకు రావాలంటూ యూరోపియన్ యూనియన్ రూపొందించిన తీర్మానానికి 100కు పైగా దేశాలు మద్దతు పలికాయి. దీనిపై జిన్ పింగ్ స్పందిస్తూ, ప్రపంచ స్పందన మేరకు సమగ్ర సమీక్ష కోసం చైనా మద్దతు ఇచ్చిందని చెప్పారు. అయితే, కరోనాపై ప్రపంచం పట్టు సాధించిన తర్వాత సమీక్ష ప్రక్రియను ప్రారంభిస్తే బాగుంటుందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే ప్రధానమని చెప్పారు.