Hyderabad: తెలంగాణలో కళకళలాడుతున్న ఆర్టీసీ బస్టాండ్లు.. ఆరు గంటలకే రోడ్డెక్కిన బస్సులు
- సాయంత్రం ఏడు గంటల తర్వాత బస్సుల నిలిపివేత
- నగర శివారు వరకు బస్సులకు అనుమతి
- మాస్కు ధరిస్తేనే బస్సులోకి
లాక్డౌన్ ఆంక్షల సడలింపుల నేపథ్యంలో తెలంగాణలో నేడు ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. లాక్డౌన్ కారణంగా దాదాపు రెండు నెలల పాటు బోసిపోయిన బస్టాండ్లు ప్రయాణికులతో మళ్లీ కళకళలాడాయి. ఉదయం ఆరు గంటలకే బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. బస్సులను, బస్టాండ్లను అధికారులు పూర్తిగా శానిటైజ్ చేశారు. మాస్కులు ధరించిన వారినే బస్సుల్లోకి అనుమతిస్తున్నారు.
జిల్లాల నుంచి బయలుదేరి హైదరాబాద్ వచ్చే బస్సులను నగర శివారు వరకే అనుమతించనున్నారు. నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాల నుంచి వచ్చే బస్సులను హయత్నగర్ వరకు మాత్రమే అనుమతిస్తారు. అలాగే సాయంత్రం ఏడుగంటల వరకు మాత్రమే బస్సులు తిరుగుతాయి. ఆ తర్వాత సర్వీసులు నిలిపివేస్తారు. అయితే, అప్పటికే టికెట్లు జారీ చేసి ఉంటే కనుక మరో గంట అదనంగా బస్సులు నడుస్తాయి.