New Delhi: వారి కాళ్లలో ఉన్నది పెట్రోలా?.. ఢిల్లీ నుంచి బీహార్‌కు రిక్షాలో ముగ్గురు వలస కూలీలు!

3 Migrant workers travel to Bihar from Delhi by cycle rickshaw
  • ఢిల్లీ నుంచి 1200 కిలోమీటర్ల దూరంలోని బీహార్‌కు రిక్షాపై పయనం
  • ఎండ వేడిమిని భరిస్తూ కష్టాన్ని కలిసి పంచుకుంటున్న వైనం
  • ఐదు రోజుల తర్వాత లక్నోకు చేరిక.. గమ్యం 700 కి. మీ. దూరంలో
కరోనా వైరస్ ఏమంటూ వచ్చిందో కానీ దేశంలో వలస కార్మికులకు ప్రాణ సంకటాన్ని తెచ్చిపెట్టింది. లాక్‌డౌన్ కారణంగా వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీల బతుకులను ఈ మహమ్మారి ఛిద్రం చేస్తోంది. తినేందుకు తిండి లేక, సొంతూరు వెళ్లే వీలు లేక చిత్రవధ అనుభవిస్తున్నారు.

వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు చేర్చేందుకు కేంద్రం శ్రామిక్ స్పెషల్ రైళ్లను నడుపుతున్నా.. వలస కూలీల కాలినడకలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా ఢిల్లీ నుంచి ముగ్గురు వ్యక్తులు ఒకే రిక్షాలో 1200 కిలోమీటర్ల దూరంలో ఉన్న బీహార్‌కు బయలుదేరడం చూసిన వారి హృదయాలను చిదిమేస్తోంది.

బీహార్‌లోని ఖగారియా జిల్లాకు చెందిన రంజిత్ కుమార్ అందరిలాగే పనుల కోసం ఢిల్లీ వచ్చాడు. లాక్‌డౌన్ కారణంగా చిక్కుకుపోయాడు. దీంతో సొంత రాష్ట్రానికి వెళ్లిపోవాలని భావించిన రంజిత్ మరో ఇద్దరు వలస కూలీలు అజయ్ కుమార్, గుడ్డూలతో కలిసి రిక్షాపై మండుటెండలో ఖగారియాకు బయలుదేరాడు. అలా అలుపెరగక రిక్షా తొక్కుతూ ఐదు రోజుల తర్వాత వీరు లక్నో చేరుకున్నారు. అక్కడి నుంచి వారు చేరుకోవాల్సిన గమ్యం మరో 700 కిలోమీటర్ల దూరంలో ఉంది.

మండుటెండ సర్రున కాలుస్తున్నా తమకు మరో మార్గం లేకుండా పోయిందని, రిక్షా తొక్కి తొక్కీ అలసిపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తమ పరిస్థితి దారుణంగా ఉందని, తిండి కోసం అల్లాడిపోతున్నామని చెప్పారు. ప్రైవేటు బస్సులు, ట్రక్కులను అడిగితే రూ. 5 వేలు అడుగుతున్నారని, అంత సొమ్ము తమ దగ్గర ఎక్కడిదని వాపోయారు. సొంతూరు చేరుకోవడానికి మరో వారం రోజులు పడుతుందని అన్నారు.

ఒకరి తర్వాత ఒకరం రిక్షా తొక్కుతూ సొంత రాష్ట్రానికి వెళ్తున్నట్టు అజయ్ కుమార్ చెప్పాడు. తాను ఢిల్లీ నుంచి కాలినడకన బయలుదేరి 120 కిలోమీటర్లు వెళ్లిన తర్వాత మార్గమధ్యంలో రంజిత్ కుమార్, గుడ్డూలు రిక్షాలో కనిపించారని, తనది కూడా బీహారేనని చెప్పడంతో వారితో కలిసి ప్రయాణించేందుకు అంగీకరించారని అజయ్ కుమార్ వివరించాడు.
New Delhi
Bihar
Cycle Rickshaw
Migrant workers

More Telugu News