Panchumarthi Anuradha: 60 ఏళ్ల మహిళను కూడా వేధిస్తారా?: వైసీపీ సర్కార్‌పై మండిపడ్డ పంచుమర్తి అనురాధ
- సోషల్ మీడియా అంటే వైసీపీకి ఎందుకంత భయం
- వృద్ధులను వేధించేందుకు సీఐడీ పోలీసులను వాడుతున్నారు
- ప్రభుత్వ తప్పిదాలను ప్రశ్నించిన వారిని వేధిస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం వృద్ధులను కూడా వేధిస్తోందని టీడీపీ నాయకురాలు పంచుమర్తి అనురాధ మండిపడ్డారు. 60 ఏళ్లు దాటిన మహిళలను కూడా వేధిస్తున్నారని అన్నారు. సోషల్ మీడియా అంటే వైసీపీకి ఎందుకంత భయమని ప్రశ్నించారు. ఫేస్ బుక్ లో ఒక పోస్టును షేర్ చేస్తే... వయసు కూడా చూడకుండా వేధిస్తారా? అని మండిపడ్డారు. వృద్ధులను వేధించేందుకు సీఐడీ పోలీసులను వాడుతున్నారని విమర్శించారు. అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి జగన్ భ్రష్టుపట్టిస్తున్నారని చెప్పారు.
12 మంది ప్రాణాలు తీసిన ఎల్జీ పాలిమర్స్ ను మంచి కంపెనీ అని చెప్పిన జగన్... సమాజ సేవ చేస్తున్న వృద్ధురాలిని క్షోభకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. గ్యాస్ లీక్ ఘటనలో పాపను కోల్పోయిన తల్లి ప్రశ్నిస్తే... ఆమెపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ తప్పిదాలను ఎత్తిచూపితే... కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు.