Virat Kohli: నెట్స్ లో రఘు విసిరే బంతుల్ని ఎదుర్కొన్నాక ఎలాంటి ఫాస్ట్ బౌలింగునైనా ఈజీగా ఆడేస్తున్నాం: కోహ్లీ

Team India Skipper Virat Kohli says about throw down specialist Raghavendra

  • టీమిండియా త్రోడౌన్ స్పెషలిస్టు గురించి చెప్పిన కోహ్లీ
  • రఘు 155 కిమీ వేగంతో బంతులు విసురుతాడని వెల్లడి
  • రఘు కారణంగా టీమిండియా దృక్పథంలో మార్పు వచ్చిందని వ్యాఖ్యలు

భారత క్రికెట్లో గంగూలీ శకం ఆరంభమయ్యాక జట్టు వ్యవహార శైలిలోనే కాదు శిక్షణ పద్ధతుల్లోనూ గణనీయమైన మార్పులు వచ్చాయి. ఆ తర్వాత ధోనీ, కోహ్లీ కూడా జట్టు ప్రాక్టీసు విధానాల్లో మరింత ఆధునికత చొప్పించారు. తాజాగా ఇదే అంశంపై ప్రస్తుత టీమిండియా సారథి విరాట్ కోహ్లీ స్పందించాడు.

నిత్యం జట్టు వెంటే ఉండే డి.రాఘవేంద్ర అనే త్రోడౌన్ స్పెషలిస్టు గురించి చెప్పాడు. రాఘవేంద్ర సైడ్ ఆర్మ్ పరికరం సాయంతో నెట్స్ లో విసిరే బంతులను ప్రాక్టీసు చేయడంతో టీమిండియా బ్యాట్స్ మన్లు పేసర్లను ఆడే విధానంలో బాగా పరిణతి చెందారని వివరించాడు.

రాఘవేంద్ర నెట్స్ లో విసిరే బంతులు 150 నుంచి 155 కిలోమీటర్ల వేగంతో దూసుకువస్తుంటాయని, నెట్స్ లో రాఘవేంద్ర బంతులు ఎదుర్కొన్న తర్వాత, మ్యాచ్ లో ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడం ఎంతో ఈజీ అని తెలిపాడు. 2013 నుంచి ఫాస్ట్ బౌలింగ్ ను ఎదుర్కోవడంలో టీమిండియా దృక్పథం ఎంతో మారిందని, అందుకు కారణం రఘు (రాఘవేంద్ర) అని స్పష్టం చేశాడు.

ఏదో గుడ్డిగా బంతులు విసరకుండా, ఆటగాళ్ల ఫుట్ వర్క్, బ్యాట్ కదలికలను దృష్టిలో ఉంచుకుని త్రోడౌన్లు వేసేవాడని కోహ్లీ కితాబిచ్చాడు. సైడ్ ఆర్మ్ పరికరంతో బంతులు విసరడంలో రఘు ఎంతో నైపుణ్యం సాధించాడని, ఇప్పుడతను ఎంతో సులువుగా 155 కిలోమీటర్ల వేగంతో బంతులు వేస్తున్నాడని వివరించాడు.

సాధారణంగా క్రికెట్ జట్లు నెట్ ప్రాక్టీసు సమయంలో సైడ్ ఆర్మ్ అనే పరికరాన్ని ఉపయోగిస్తుంటాయి. సైడ్ ఆర్మ్ పరికరాన్ని చేత్తో పట్టుకుని విసిరితే బంతి విపరీతమైన వేగంతో దూసుకెళుతుంది. సైడ్ ఆర్మ్ పరికరం చివర్లో ఉండే స్పూన్ వంటి నిర్మాణంలో బంతిని ఉంచి విసురుతారు.

  • Loading...

More Telugu News