Amit Shah: బెంగాల్ ను సమీపిస్తున్న తుపాన్... మమతాబెనర్జీకి అమిత్ షా భరోసా!
- అంతకంతకూ బలపడుతున్న ఎంఫాన్ తుపాను
- రేపు తీరం దాటనున్న పెను తుపాను
- 50 లక్షల మంది సురక్షిత ప్రాంతాలకు తరలింపు
బెంగాల్, ఒడిశా తీరంవైపు పెను తుపాను ఎంఫాన్ శరవేగంగా వస్తోంది. ఈ నేపథ్యంలో సదరు రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా సమీక్ష నిర్వహించారు. ఫోన్ ద్వారా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ లతో ఆయన మాట్లాడారు. తుపానును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని చెప్పారు.
కేటగిరీ 5 హరికేన్ తో సమానమైన ఎంఫాన్ అంతకంతకూ బలపడుతోంది. రేపు అది తీరాన్ని దాటబోతోంది. ఈ నేపథ్యంలో తీర ప్రాంతంలోని 50 లక్షలకు పైగా జనాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మీకు అండగా ఉందని ఇరువురు ముఖ్యమంత్రులకు భరోసా ఇచ్చారు.
మరోవైపు, తుపాను ప్రభావం ఏపీలో కూడా కనిపిస్తోంది. పలు ప్రాంతాల్లో సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. అలలు పెద్ద ఎత్తున ఎగసిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో, కోస్తా జిల్లాల అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.