USA: కరోనా నేపథ్యంలో ఇండియాకు మరో సాయం చేస్తున్న అమెరికా
- భారత్ కు 200 వెంటిలేటర్లను ఇస్తున్న అమెరికా
- త్వరలోనే ఇండియాకు రానున్న 50 వెంటిలేటర్లు
- కరోనాపై పోరాటానికి ఇది కాంప్లిమెంట్ అన్న యూఎస్ అధికారిణి
కరోనా నేపథ్యంలో భారత్ కు మరో సాయాన్ని అందించేందకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. 200 వెంటిలేటర్లను డొనేట్ చేయాలని నిర్ణయించారు. వీటిలో 50 వెంటిలేటర్లు త్వరలోనే భారత్ కు రానున్నాయి. ఈ విషయాన్ని అమెరికా ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. కరోనాపై సంయుక్త పోరాటంలో భాగంగా భారత్ కు అమెరికా చేయూతను అందిస్తోంది.
భారత్ కు వెంటిలేటర్లను అందిస్తామని గత వారమే ట్రంప్ ప్రకటించారు. కంటికి కనిపించని శత్రువుతో చేస్తున్న పోరాటంలో భాగంగానే ఈ సాయం చేస్తున్నట్టు తెలిపారు.
మరోవైపు, వెంటిలేటర్లను ఇండియాకు అమ్ముతున్నారా? అనే ప్రశ్నకు బదులుగా... ఇది డొనేషన్ మాత్రమేనని యూఎస్ ఎయిడ్ యాక్టింగ్ డైరెక్టర్ రమోనా తెలిపారు. కరోనాపై భారత్ చేస్తున్న పోరాటానికి ఈ వెంటిలేటర్లు కాంప్లిమెంట్ అని ఆమె చెప్పారు. అమెరికాకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ ను భారత్ ఇచ్చిందని, ఈ నేపథ్యంలోనే వెంటిలేర్లను ఇస్తున్నారా? అనే మరో ప్రశ్నకు బదులుగా... ఇది క్విడ్ ప్రోకో కాదని, ఇరు దేశాల మధ్య భాగస్వామ్యంలో ఒక భాగమని తెలిపారు.