Shahid Afridi: షాహిద్ అఫ్రిదీ వ్యాఖ్యలపై విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ ఫైర్!
- మోదీపై విమర్శలు గుప్పించిన షాహిద్ అఫ్రిదీ
- అఫ్రిదీది నెగెటివ్ మనస్తత్వమన్న కోహ్లీ కోచ్ రాజ్ కుమార్ శర్మ
- అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాడని వ్యాఖ్య
భారత్ పై ఎప్పుడూ విషం చిమ్మే పాక్ మాజీ క్రికెట్ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ... తాజాగా మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. మత విద్వేషంతో భారత ప్రధాని మోదీ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. కశ్మీరీలపై మోదీ అరాచకాలకు పాల్పడుతున్నారని అన్నాడు. ఈ వ్యాఖ్యలపై టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిన్ననాటి కోచ్ రాజ్ కుమార్ శర్మ మండిపడ్డారు.
అఫ్రిదీ నెగెటివ్ మనస్తత్వం కలిగిన వ్యక్తి అని రాజ్ కుమార్ శర్మ అన్నారు. ఇండియా టీమ్ లో ఎవరూ అతన్ని పట్టించుకోరని చెప్పారు. క్రికెట్ ఆడుతున్నప్పుడు కూడా ఎవరూ అతన్ని పట్టించుకోలేదని అన్నారు. అఫ్రిదీ ఎప్పుడూ అనవసరమైన మాటలు మాట్లాడుతుంటాడని.. అతన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పారు.
భారత క్రికెటర్లు అఫ్రిదీ మాదిరి మాట్లాడరని... ఇతర దేశాల ప్రధానుల్ని విమర్శించరని అన్నారు. ఇండియన్ ప్లేయర్లను చూసి అఫ్రిదీ నేర్చుకోవాలని హితవు పలికారు. కోహ్లీ కూడా అఫ్రిదీ గురించి ఎప్పుడూ మాట్లాడలేదని... ఎందుకంటే అఫ్రిదీ అంత గొప్ప వ్యక్తి కాదని అన్నారు. మరోవైపు అఫ్రిదీపై గౌతమ్ గంభీర్, హర్భజన్ సింగ్, సురేశ్ రైనా కూడా తీవ్ర విమర్శలు గుప్పించారు.