Von Wellx: చైనాను వీడి భారత్ కు రానున్న పాదరక్షల తయారీ సంస్థ 'వాన్ వెలెక్స్'!
- రూ. 100 కోట్ల పెట్టుబడితో యూపీలో ఏర్పాటు
- రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం
- వెల్లడించిన లాట్రిక్ ఇండస్ట్రీస్ సీఈఓ ఆశీష్ జైన్
వాన్ వెలెక్స్ పేరిట లగ్జరీ బ్రాండ్ పాదరక్షలను అందిస్తున్న జర్మనీకి చెందిన కాసా ఎవర్జ్ జీఎంబీహెచ్ సంస్థ, చైనాను వీడి ఇండియాకు రానుంది. చైనాలో సంవత్సరానికి 30 లక్షల జతల పాదరక్షలను తయారు చేస్తున్న ప్లాంటును భారత్ కు తరలిస్తోంది. ఈ మేరకు తొలి విడతగా ఇండియాలో రూ. 110 కోట్లను కాసా ఎవర్జ్ ఇన్వెస్ట్ చేయనుందని, ఇండియాలో వాన్ వెలెక్స్ బ్రాండ్ లైసెన్సీగా ఉన్న లాట్రిక్ ఇండస్ట్రీస్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆశిష్ జైన్ వెల్లడించారు. ప్రస్తుతం లాట్రిక్ సంస్థ ఏడాదికి 10 లక్షల పాదరక్షలను తయారు చేసి కాసా ఎవర్జ్ కు అందిస్తోంది.
ఇక ఈ ప్లాంటును ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో ఏర్పాటు చేయనున్నామని, రెండేళ్లలో ఉత్పత్తి ప్రారంభం అవుతుందని తెలిపిన ఆశీష్ జైన్, పాదరక్షల తయారీకి అవసరమైన కార్మికులు, ముడి పదార్థాల విషయంలో ఇండియా ఆకర్షణీయంగా ఉండటంతోనే కాసా ఎవర్జ్ ఈ నిర్ణయం తీసుకున్నదని అన్నారు. విదేశీ పరిశ్రమలను రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో నిర్ణయాలను తీసుకుందని, భవిష్యత్ తయారీ కేంద్రంగా భారత్ ఆవిర్భవిస్తుందని అభిప్రాయపడ్డారు.
కాగా, ప్రపంచ వ్యాప్తంగా 18 ప్లాంట్లను నిర్వహిస్తున్న కాసా ఎవర్జ్, పలు దేశాల్లో లైసెన్సీ సంస్థలను కూడా ఏర్పాటు చేసుకుంది. 12 లైసెన్సీల సాయంతో 80 దేశాల్లో తమ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తోంది. ఇండియాలో వాన్ వెలెక్స్ బ్రాండ్ గత సంవత్సరం నుంచే అందుబాటులోకి వచ్చింది.