Hindupuram: హోం క్వారంటైన్ లో ఉన్నందునే రాలేకపోతున్నాను: హిందూపురం వాసులకు బాలకృష్ణ వీడియో సందేశం
- నిత్యమూ అధికారులతో పరిస్థితిని సమీక్షిస్తున్నా
- నా వంతుగా రూ. 25 లక్షల విలువైన వెంటిలేటర్లు, పీపీఈ కిట్స్ పంపా
- స్టే హోమ్ - స్టే సేఫ్ అంటూ వీడియో
తన నియోజకవర్గ ప్రజల కోసం హిందూపురం ఎమ్మెల్యే, హీరో నందమూరి బాలకృష్ణ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. తాను ప్రస్తుతం నియోజకవర్గానికి రాలేకున్నానని, కరోనాను తరిమేసేందుకు తన వంతు ప్రయత్నంగా రూ. 25 లక్షల విలువైన వెంటిలేటర్లు, పీపీఈ కిట్లను అందించానని తెలిపారు.
"లాక్ డౌన్ అమలులో ఉన్నందున, నేను హౌస్ క్వారంటైన్‌లో ఉన్నందున, హిందూపురం రాలేకపోవచ్చు. రోజూ జిల్లా కలెక్టర్, రెవిన్యూ అధికారులు, డాక్టర్స్ తో ఫోన్ ద్వారా పరిస్థితులు సమీక్షిస్తున్నాను. హిందూపురంలో కేసులు పెరిగిపోవడం, కోవిడ్ ఆస్పత్రి ఏర్పాటుతో రోగులకు మెరుగైన చికిత్స అందించడం కోసం నా వంతుగా బసవతారకం ట్రస్ట్ ద్వారా 25 లక్షల రూపాయిల విలువ చేసే రెండు వెంటిలేటర్లు, అలాగే వైద్య సిబ్బంది కోసం 100 పీపీఈ యూనిట్లు మా వాళ్ళ ద్వారా అందచేయడం జరుగుతుంది. మీ అందరి సహాయ సహకారాలతో త్వరలోనే కరోనా లేని హిందూపురాన్ని చూద్దాం. స్టే హోమ్, స్టే సేఫ్" అని బాలకృష్ణ ఈ వీడియోలో వ్యాఖ్యానించారు.