Bhadradri Kothagudem District: ఒకరిని రక్షించబోయి మరొకరు.. చెరువులో మునిగి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి
- భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘటన
- కాళ్లు, చేతులు శుభ్రం చేసుకునేందుకు వెళ్లి మృత్యువాత
- తండ్రి, కుమారుడు, మేనల్లుడు మృతి
తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలంలో విషాదం చోటుచేసుకుంది. చెరువులో మునిగిపోతున్న యువకుడిని కాపాడబోయి ఒకరు, అతడిని కాపాడబోయి మరొకరు.. ఇలా ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు.
పోలీసుల కథనం ప్రకారం.. లక్ష్మీపురానికి చెందిన రైతు నల్లమోతు అప్పారావు (40) కూరగాయలు సాగుచేశాడు. నిన్న ఉదయం తండ్రి కృష్ణయ్య, కుమారుడు తేజేశ్ (21), చెల్లెలి కొడుకు వినయ్‌కుమార్ (17)తో కలిసి పురుగుమందు కొట్టేందుకు పొలానికి వెళ్లాడు. పని పూర్తయిన తర్వాత కాళ్లు, చేతులు కడుక్కునేందుకు రేపాక చెరువు వద్దకు వెళ్లారు.
చేతులు కడుక్కునే ప్రయత్నంలో వినయ్‌కుమార్ ప్రమాదవశాత్తు చెరువులో మునిగిపోయాడు. వెంటనే అప్రమత్తమైన తేజేశ్ అతడిని రక్షించే ప్రయత్నంలో అతడు కూడా నీళ్లలోకి జారిపోయాడు. దీంతో వీరిద్దరినీ కాపాడేందుకు నీళ్లలో దిగిన అప్పారావు కూడా మునిగిపోయాడు. అందరూ ఒకరి తర్వాత ఒకరు మునిగిపోతుండడంతో ఆందోళన చెందిన తండ్రి కృష్ణయ్య కూడా నీటిలో దిగాడు. అయితే, అతడు కూడా మునిగిపోతుండడంతో గమనించిన స్థానికులు వెంటనే అక్కడికి చేరుకుని అతడిని రక్షించారు. మిగతా ముగ్గురు విగతజీవులయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.