Lockdown: లాక్డౌన్ పొడిగింపుతో ఆ ఎనిమిది రాష్ట్రాలకు కష్టకాలం: క్రిసిల్
- దేశీయ ఉత్పత్తిలో ఏపీ, తెలంగాణ, తమిళనాడు, బెంగాల్దే 65.5 శాతం వాటా
- జీడీపీలో 60 కరోనా కేసులు అధికంగా ఉన్న రాష్ట్రాల నుంచే
- నిర్మాణ రంగంలోనూ 60 శాతం వాటా వాటిదే
దేశంలో లాక్డౌన్ పొడిగింపు వల్ల ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని దేశీయ రేటింగ్ సంస్థ క్రిసిల్ తెలిపింది. ఈ మేరకు నిన్న ఓ నివేదికను విడుదల చేసింది. దేశంలోని మొత్తం ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, తెలంగాణ రాష్ట్రాల వాటానే 65.5 శాతమని, నిర్మాణ రంగంలోనూ 60 శాతం వాటా వీటిదేనని క్రిసిల్ తన నివేదికలో పేర్కొంది.
కరోనా మహమ్మారి తీవ్రత అధికంగా ఉన్న 8 రాష్ట్రాల నుంచే 60 శాతానికిపైగా జీడీపీ వచ్చేదని, ఇప్పుడు కరోనా కారణంగా ఆంక్షలను కొనసాగించడం వల్ల వాటిపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని అంచనా వేసింది. అలాగే, రుణభారం ఎక్కువ కావడం, పెట్రోలియం, మద్యం అమ్మకాలు, స్టాంపు డ్యూటీలపైనే ఆధారపడడం వంటి కారణాల వల్ల ఆయా రాష్ట్రాలు ఇబ్బందుల్లో పడే అవకాశం ఉందని తెలిపింది. ఆయా రాష్ట్రాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ఆంక్షలనూ పొడిగించారని, ఇది ఆర్థిక వ్యవస్థను మరింత కష్టాల్లోకి నెట్టేస్తుందని క్రిసిల్ పేర్కొంది.