Donald Trump: నేను ప్రచారం చేయడం వల్లే దీనికి చెడ్డ పేరు వచ్చింది!: ట్రంప్

Trump says its line of deffence

  • మలేరియా మందు హైడ్రాక్సీ క్లోరోక్విన్ 
  • కరోనాకు బాగా పనిచేస్తుందన్న ట్రంప్
  • రోజుకొక ట్యాబ్లెట్ వేసుకుంటున్నా
  • దుష్ఫలితాలు లేవంటున్న ట్రంప్  

హైడ్రాక్సీ క్లోరోక్విన్.. మలేరియాకు వాడే ఈ మందు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పుణ్యమాని బాగా పాప్యులర్ అయిపోయింది. కరోనాకు ఈ ఔషధం అద్భుతంగా పనిచేస్తుందంటూ ట్రంప్ ఆమధ్య చెప్పినప్పటి నుంచీ దీనికి డిమాండ్ పెరిగింది. అంతేకాదు, ముందు జాగ్రత్త చర్యగా ఈ ట్యాబ్లెట్ రోజుకొకటి చొప్పున తాను వేసుకుంటున్నానని మొన్నే ఆయన సెలవిచ్చారు.

అంతలోనే ఇప్పుడు మళ్లీ ఈ మందు గొప్పతనం గురించి నిన్న పెద్ద లెక్చరే ఇచ్చారాయన. కరోనా వైరస్ విషయంలో హైడ్రాక్సీ క్లోరోక్విన్ ఒక 'రక్షణ రేఖ' (లైన్ ఆఫ్ డిఫెన్స్)  అంటూ కొత్త టైటిల్ని కూడా ఇచ్చారు. 'ఇదొక అద్భుతమైన ఔషధం.. సురక్షితమైనది కూడా' అంటూ వ్యాఖ్యానించారు.

'ఇది నేనంటున్న మాట కాదు. చాలా మంది డాక్టర్లు చెప్పిన మాట. మా వైట్ హౌస్ లో నాకో డాక్టరున్నారు. ఈ మందుపై మీ అభిప్రాయం ఏమిటని అడిగాను.. లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటూ ఆయన ఒక్క ముక్కలో దీనికి కాంప్లిమెంట్స్ ఇచ్చేశారు' అన్నారు ట్రంప్. 'ఇది చాలా శక్తిమంతమైన ఔషధం. నేను వాడుతున్నాను కదా, ఎటువంటి దుష్పలితాలు లేవు. కరోనాకు ముందుగా దీనినే వాడాలి' అన్నారు.

'ఇక్కడ మీకో విషయం చెప్పాలి.. ఒక వస్తువుకి ప్రచారం చేయడం అన్నది నాకు తెలియదు. అందుకే నేను ప్రచారం చేయడం వల్లే ఈ ఔషధానికి చెడ్డ పేరు వచ్చింది. అదే మరొకరు ప్రచారం చేసుంటే.. ఇంత అద్భుతమైన మందు మరొకటి లేదని అనే వారు' అన్నారు ట్రంప్.        
 
మరి, ఈ మందు పనిచేయడం లేదంటూ ఇటీవల ఓ నివేదిక వచ్చింది కదా? అంటే, 'ఇక చనిపోతారనే స్థితిలో వున్న వారికి ఈ ఔషధాన్ని వాడి, అది పనిచేయడం లేదంటూ తప్పుడు ప్రచారం చేశారు' అంటూ ట్రంప్ వారిపై మండిపడ్డారు.    

  • Loading...

More Telugu News