Pothireddypadu: ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన 203 జీవోపై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే
- నిపుణుల కమిటీని ఏర్పాటు చేసిన గ్రీన్ ట్రైబ్యునల్
- రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశం
- ఎలాంటి నిర్మాణాలు చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు
పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీ పెంపు, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి తాత్కాలిక బ్రేక్ పడింది. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన జీవో 203పై నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ స్టే విధించింది. ఈ రెండు ప్రాజెక్టులకు సంబంధించి ఎలాంటి పనులు చేపట్టవద్దని ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతల పథకంపై కేంద్ర పర్యావరణ శాఖకు సంబంధించిన నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీలో కృష్ణా నదీ జలాల నిర్వహణ బోర్డు సీనియర్ సభ్యుడు, హైదరాబాద్ ఐఐటీ నుంచి ఒక సభ్యుడు, కాలుష్య నివారణ బోర్డు సభ్యుడు ఉంటారు. రెండు నెలల్లో దీనిపై నివేదిక సమర్పించాలని కమిటీని గ్రీన్ ట్రైబ్యునల్ కోరింది. తాము తదుపరి ఆదేశాలు ఇచ్చేంత వరకు ఎలాంటి నిర్మాణాలను చేపట్టవద్దని ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.