YSRCP: వైసీపీ ప్రజాప్రతినిధులపై సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదు?: హైకోర్టు ఆగ్రహం
- లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ప్రజాప్రతినిధులు
- కరోనా వ్యాపించేలా వ్యవహరించారని పిటిషన్లు
- ప్రజాప్రతినిధులై ఉండి నిబంధనలు పాటించలేదన్న హైకోర్టు
వైసీపీ ఎమ్మెల్యే రోజా సహా ఆ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా లాక్ డౌన్ నిబంధనలను ఉల్లంఘించారంటూ ఇటీవల ఏపీ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందేలా వైసీపీ నేతలు వ్యవహరించారని... వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని పిటిషన్ దారులు కోరారు.
ఈ పిటిషన్లను ఈ రోజు విచారించిన హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వంపైనా, నిబంధనలను ఉల్లంఘించిన వైసీపీ ప్రజాప్రతినిధులపైనా ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రజాప్రతినిధులై ఉండి నిబంధనలను పాటించలేదని వ్యాఖ్యానించింది. నిబంధనలను పాటించని ప్రజాప్రతినిధులపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోనప్పుడు... వారిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించకూడదని ప్రశ్నించింది. సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించకూడదని నిలదీసింది.
ఈ నేపథ్యంలో, ప్రభుత్వం తరపున వివరాలు అందించేందుకు కొంత సమయం ఇవ్వాలని ఏజీ కోరారు. దీంతో, విచారణను వచ్చే వారానికి హైకోర్టు వాయిదా వేసింది.