Uttar Pradesh: సొంతపార్టీపై తీవ్రస్థాయిలో మండిపడిన యూపీ కాంగ్రెస్ ఎమ్మెల్యే అదితీ సింగ్
- కాంగ్రెస్‌లో దుమారం రేపుతున్న అదితీ సింగ్ వ్యాఖ్యలు
- ఇలాంటి సమయాల్లో ఈ క్రూరమైన జోకులేంటంటూ మండిపాటు
- అచ్చం పోలీసులు చేసిన ఆరోపణలే చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీ కాంగ్రెస్ ఎమ్మెల్యే, గాంధీ కుటుంబానికి అత్యంత సన్నిహితురాలైన అదితీ సింగ్ సొంతపార్టీపైనే తీవ్ర విమర్శలు చేయడం పార్టీలో కలకలం రేపింది. యూపీలో చిక్కుకుపోయిన వలస కార్మికులను సొంత రాష్ట్రాలకు పంపేందుకు ప్రియాంక గాంధీ వెయ్యి బస్సులు ఏర్పాటు చేశారు. ఈ బస్సుల విషయంలో కాంగ్రెస్, అధికార బీజేపీ మధ్య ఇప్పటికే వివాదం చెలరేగింది. బస్సులు ఫిట్‌గా లేవంటూ కాంగ్రెస్ యూపీ చీఫ్, ప్రియాంక గాంధీ పీఏపై లక్నో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేశారు.
తాజాగా, ఇప్పుడు అదితీ సింగ్ మాట్లాడుతూ.. వలస కార్మికుల కోసం ఏర్పాటు చేసిన బస్సులు చాలా చిన్నవిగా ఉన్నాయని, ఇది చాలా క్రూరమైన జోక్ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి సంక్షోభ సమయాల్లో ఇలాంటి నీచ రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలీల కోసం పంపుతామన్న వెయ్యి బస్సుల్లో సగం బస్సులు తప్పుడు నంబర్లతో ఉన్నాయని, 297 బస్సులు చెత్తగా ఉండగా, 98 ఆటో రిక్షాలు, అంబులెన్సులు ఉన్నాయని, మరో 68 బస్సులకు అసలు పేపర్లే లేవంటూ అచ్చంగా పోలీసులు చేసిన ఆరోపణలే ఆమె కూడా చేశారు.
రాజస్థాన్‌లోని కోటలో చిక్కుకుపోయిన విద్యార్థులను తీసుకొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు విద్యార్థులను సరిహద్దుల్లో విడిచిపెట్టి అమానుషంగా ప్రవర్తించాయని మండిపడ్డారు. వారి కోసం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ బస్సులను పంపి వారిని సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చారని గుర్తు చేశారు. యోగిని ప్రశంసిస్తూ సొంతపార్టీపై అదితీ సింగ్ చేసిన వ్యాఖ్యలు యూపీలో రాజకీయ దుమారం రేపుతున్నాయి.