America: కరోనా అప్ డేట్: కొనసాగుతున్న కరోనా మరణమృదంగం.. ప్రపంచవ్యాప్తంగా 3.26 లక్షల మంది బలి!
- 50 లక్షలు దాటేసిన కేసులు
- ఒక్క అమెరికాలోనే 90 వేలకు పైగా మరణాలు
- తెరిపినపడుతున్న ఐరోపా దేశాలు
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. ఈ మహమ్మారి బారినపడిన వారి సంఖ్య 50 లక్షలు దాటిపోయింది. వైరస్ దెబ్బకు అమెరికా, బ్రిటన్ రష్యాలు అల్లాడిపోతున్నాయి. ఇక మొత్తం బాధితుల్లో 15 లక్షల మంది ఒక్క అమెరికాలోనే ఉండడం అక్కడి పరిస్థితిని చెప్పకనే చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ మహమ్మారి బారినపడి మరణించిన వారి సంఖ్య 3.26 లక్షలు దాటేసింది. వీటిలోనూ 90 వేలకుపైగా మరణాలు ఒక్క అమెరికాలోనే సంభవించాయి.
వైరస్ వ్యాప్తి మొదలైన తొలి రోజుల్లో చైనా, అమెరికా, ఐరోపా దేశాల్లో విలయతాండవం చేసిన ఈ మహమ్మారి ప్రస్తుతం అక్కడ క్రమంగా తగ్గుముఖం పడుతుండగా.. రష్యా, బ్రెజిల్‌లో మాత్రం విశ్వరూపం ప్రదర్శిస్తోంది. నిన్నమొన్నటి వరకు కోవిడ్‌తో విలవిల్లాడిన స్పెయిన్, ఇటలీ దేశాలు ఇప్పుడిప్పుడే తెరిపిన పడుతుండగా, రష్యాలో కేసులు మూడు లక్షలు దాటాయి.
కరోనాను చాలా తేలిగ్గా తీసుకుంటున్న బ్రెజిల్‌లో మాత్రం వైరస్ చెలరేగిపోతోంది. అక్కడ గత 24 గంటల్లోనే ఏకంగా 1,179 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజులో నమోదైన అత్యధిక మరణాలు ఇవే కావడం గమనార్హం. అలాగే, కేసుల సంఖ్య కూడా ఇక్కడ మూడు లక్షలకు చేరువైంది.
లాక్‌డౌన్ కారణంగా ఆర్థిక వ్యవస్థలు కుప్పకూలడంతో పలు దేశాలు ఆంక్షలను సడలించాయి. దీంతో ఇప్పటి వరకు పడిన శ్రమ వృథా అయింది. ఆయా దేశాల్లో వైరస్ మళ్లీ కోరలు చాస్తోంది. జనం నిబంధనలు బేఖాతరు చేస్తూ గుంపులుగుంపులుగా బయట తిరుగుతుండడంతో మళ్లీ వైరస్ వ్యాప్తి మొదలై కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి.