India: బంగారం పరుగుకు నేడు బ్రేక్... తగ్గిన ధర!
- గత మూడు రోజులుగా పెరిగిన ధర
- అంతర్జాతీయ మార్కెట్లో దిగొచ్చిన పుత్తడి
- ఇండియాలో రూ. 46,978కి పది గ్రాముల ధర
గత కొన్ని రోజులుగా పరుగులు పెడుతున్న బంగారం ధరకు గురువారం నాడు బ్రేక్ పడింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్సు బంగారం ధర 11 డాలర్లు తగ్గి 1,742.50 డాలర్లకు చేరడంతో ఆ ప్రభావం దేశవాళీ బులియన్ మార్కెట్ పైనా పడింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ లో ఈ ఉదయం 10 గ్రాముల బంగారం ధర క్రితం ముగింపుతో పోలిస్తే రూ. 288 తగ్గి రూ. 46,978కి చేరింది. బంగారం ధర రూ. 46,500 పైన స్థిరంగా కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఇప్పటికే అమెరికా, చైనాల మధ్య నెలకొనివున్న వాణిజ్య అస్థిరత బంగారానికి డిమాండ్ ను పెంచగా, సెంట్రల్ బ్యాంకులు మరోమారు ఉద్దీపన ప్యాకేజీలు ప్రకటించే అవకాశాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో గత మూడు రోజులుగా బంగారం ధర పెరుగుతూ వచ్చింది. ఇదే సమయంలో చైనా కంపెనీలు యూఎస్ స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ కాకుండా బిల్ పాస్ కావడంతో దాని ప్రభావం బులియన్ మార్కెట్ పై పడి ధరలు తగ్గాయని విశ్లేషకులు అంచనా వేశారు.