Ganta Srinivasa Rao: ఒక సగటు వినియోగదారుడిగా వాళ్ల బాధలు ఆలకించండి: గంటా
- రాష్ట్రంలో అధిక విద్యుత్ బిల్లులపై ఆందోళన
- మూడ్నెల్ల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించాలన్న గంటా
- దీన్ని కూడా విపత్తులో భాగంగానే చూడాలని సూచన
రాష్ట్రంలో లాక్ డౌన్ నేపథ్యంలో విద్యుత్ బిల్లులు అధికంగా వస్తున్నాయంటూ విపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్న సంగతి తెలిసిందే. దీనిపై మాజీ మంత్రి, టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు స్పందించారు.
సీఎం జగన్ తీసుకువచ్చిన డైనమిక్ విధానం వల్ల విద్యుత్ బిల్లులు ఒక్కసారిగా పెరిగిపోయాయని, అసలే రెండు నెలలుగా ఉపాధి లేక, ఆదాయం రాక సగటు ఆంధ్రా పౌరుడు బిల్లు చెల్లించలేని పరిస్థితుల్లో విలవిల్లాడుతున్నాడని వివరించారు. సగటు వినియోగదారుడిగా ఒక్కసారి ప్రజల బాధను ఆలకించాలని విజ్ఞప్తి చేశారు.
మూడు నెలల విద్యుత్ బిల్లులను ప్రభుత్వమే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దీన్ని కూడా విపత్తులో భాగంగానే పరిగణించాలని, విపత్తు నిర్వహణ నిధుల నుంచి ప్రజలను ఆదుకునే ఆలోచన చేయాలని గంటా ఏపీ ప్రభుత్వానికి సూచించారు.