paki: ఆఫ్ఘనిస్థాన్ లో భారత్ ప్రాభవాన్ని తగ్గించేందుకు పాక్ కుట్రలు: అమెరికా రక్షణ శాఖ నిఘా విభాగం
- ఉగ్రవాదులకు ఆశ్రయం ఇస్తోంది
- భారత్ విషయంలో పాక్ పంథా మారలేదు
- తాలిబాన్లతో సంబంధాలు దెబ్బతినకూడదనే యోచనలో ఉంది
భారత్ ను ఎదుర్కొనేందుకు ఉగ్రవాదులను పాకిస్థాన్ ఆశ్రయిస్తోందని అమెరికా రక్షణ శాఖ నిఘా విభాగం విడుదల చేసిన నివేదికలో వెల్లడైంది. ఆప్ఘనిస్థాన్ లో భారత్ ప్రాభవం పెరుగుతోందని... దాన్ని నివారించేందుకు తాలిబాన్, హక్కానీ నెట్ వర్క్ వంటి సంస్థలకు ఆశ్రయం ఇస్తోందని పేర్కొంది.
ఆఫ్ఘన్ లో భారత్ కు స్థానం లేకుండా చేసేందుకు యత్నిస్తోందని... దీని కోసం తన ఉగ్ర పంథాను కొనసాగిస్తోందని తెలిపింది. భారత్ విషయంలో పాకిస్థాన్ పంథా ఏమాత్రం మారలేదని చెప్పింది. జనవరి నుంచి మార్చ్ కాలానికి సంబంధించిన ఈ నివేదికను రక్షణశాఖ ఇన్స్ పెక్టర్ జనరల్ రూపొందించారు. అమెరికా, ఆఫ్ఘన్ తాలిబాన్లకు మధ్య శాంతి ఒప్పందం కుదిరిన తర్వాత విడుదల కాబోతున్న తొలి నివేదిక ఇదే కావడం గమనార్హం.
ఇదే సమయంలో ఆఫ్ఘన్ విషయంలో పాక్ జాగ్రత్త పడుతున్నట్టు కూడా నివేదికలో పేర్కొన్నారు. ఆప్ఘన్ లోని అస్థిర పరిస్థితులు తమకు ఇబ్బందిగా మారకూడదని పాక్ భావిస్తోందని తెలిపారు. అమెరికాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని తాలిబాన్లపై పాకిస్థాన్ ఒత్తిడి తెచ్చిందని... ఇదే సమయంలో హింసను విడనాడాలని మాత్రం తాలిబాన్లకు సూచించడం లేదని నివేదికలో పేర్కొన్నారు. తాలిబాన్లతో సంబంధాలు దెబ్బతినకూడదనే యోచనలో భాగంగానే పాక్ ఈ విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు.