Warangal Rural District: వరంగల్ జిల్లాలో దారుణం.. బావిలో శవాలుగా తేలిన వలస కుటుంబం!
- ఆర్థిక ఇబ్బందులు లేవంటున్న యజమాని
- కనిపించని కుమారులు, బీహార్ యువకులు
- అనుమానాస్పద మృతిగా కేసు నమోదు
వరంగల్ రూరల్ జిల్లా గీసుకొండ మండలం గొర్రెకుంట పారిశ్రామికవాడలో దారుణం జరిగింది. కోల్‌కతాకు చెందిన వలస కార్మికుల కుటుంబం ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. స్థానికంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.
కోల్‌కతాకు చెందిన మక్సూద్ (50) 25 ఏళ్లుగా వరంగల్ అర్బన్ జిల్లాలోని కరీమాబాద్‌లో బార్దాన్ కూలీగా పనిచేస్తున్నాడు. భార్య నిషా (45), ఇద్దరు కుమారులతోపాటు భర్తతో విడాకులు తీసుకున్న కుమార్తె కూడా వారితోనే ఉంటోంది. లాక్డౌన్ నేపథ్యంలో వీరి కుటుంబం పారిశ్రామికవాడలోని సాయిదత్తా బార్దాన్ ట్రేడర్స్‌లోని భవనంలోనే ఉంటోంది. అదే భవనంలో బీహార్ యువకులు కూడా ఉంటున్నారు.
ట్రేడర్స్ యజమాని నిన్న భవనం వద్దకు రాగా, వీరెవరూ కనిపించలేదు. దీంతో ఆయన గీసుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం అక్కడే వెతుకుతుండగా ప్రాంగణంలోని బావిలో శవాలు తేలుతూ కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికి తీశారు. వారిని మక్సూద్, నిషా, వారి 22 ఏళ్ల కుమార్తె, మూడేళ్ల మనవడుగా గుర్తించారు.
అయితే, నలుగురు మృతదేహాలు మాత్రమే లభ్యం కావడంతో అదే భవనంలో ఉంటున్న బీహార్ యువకులు, మక్సూద్ కుమారులు ఏమయ్యారన్నది మిస్టరీగా మారింది. మక్సూద్ కుటుంబానికి ఆర్థిక ఇబ్బందులు కూడా లేవని, వారి కుటుంబం మొత్తం కలిసి రోజుకు నాలుగు వేల రూపాయలు సంపాదిస్తోందని ట్రేడర్స్ యజమాని తెలిపాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.