Reliance: జియోలోకి పెట్టుబడుల వెల్లువ.. రూ.11,367 కోట్ల పెట్టుబడికి ముందుకొచ్చిన కేకేఆర్
- ఇప్పటికే ఫేస్‌బుక్, సిల్వర్ లేక్ వంటి దిగ్గజాల పెట్టుబడులు
- రూ. 11,367 కోట్లతో 2.32 శాతం షేర్ల కొనుగోలు
- పెట్టుబడుల ద్వారా రూ.78,562 కోట్ల సమీకరణ
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్)కు చెందిన జియో ప్లాట్‌ఫాంలోకి ఇటీవల పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయి. పలు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు జియోలో పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా, న్యూయార్క్‌కు చెందిన పెట్టుబడి సంస్థ కేకేఆర్ జియోలో రూ. 11,367 కోట్లు పెట్టుబడిగా పెట్టాలని నిర్ణయించింది. ఆసియాలోనే ఇది అతిపెద్ద పెట్టుబడి కానుందని ఆర్ఐఎల్ తెలిపింది.
జియో ప్లాట్‌ఫామ్స్‌లో కేకేఆర్ రూ.11,367 కోట్లు పెట్టుబడి పెట్టనుందని ఆర్ఐఎల్, జియో ప్లాట్‌ఫామ్స్ విడుదల చేసిన ఓ ప్రకటనలో తెలిపాయి. జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఈ లావాదేవీ ఈక్విటీ విలువ రూ. 4.91 లక్షల కోట్లు కాగా, ఎంటర్‌ప్రైజ్ విలువ రూ. 5.16 లక్షల కోట్లని ఆర్‌ఐఎల్ తెలిపింది. ఈ పెట్టుబడితో జియోలోని 2.32 శాతం వాటా కేకేఆర్ పరం కానుంది. కాగా, టెక్నాలజీ దిగ్గజాలైన ఫేస్‌బుక్, సిల్వర్ లేక్, విస్టా, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్‌ల పెట్టుబడి ద్వారా జియో రూ. 78,562 కోట్లు సమీకరించింది.