Chennai: ఏటీఎంకి వెళ్లొచ్చాడు.. కరోనా బారినపడ్డాడు!
- 50 రోజులుగా ఇంటికే పరిమితం
- పరీక్షలు చేయించుకుని కంపెనీకి రావాల్సిందిగా పిలుపు
- పరీక్షల్లో కరోనా పాజిటివ్
దాదాపు 50 రోజులుగా ఇంటికే పరిమితమై కరోనాకు దూరంగా ఉన్న వ్యక్తి, డబ్బులు డ్రా చేసుకునేందుకు ఏటీఎంకు వెళ్లి వైరస్ బారినపడ్డాడు. చెన్నైలోని మనలిలో జరిగిందీ ఘటన. ఓ సంస్థలో పనిచేస్తున్న బాధితుడు లాక్‌డౌన్ కారణంగా దాదాపు 50 రోజులుగా ఇంటికే పరిమితమయ్యాడు.
ప్రస్తుతం లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో అతడు పనిచేస్తున్న సంస్థ కార్యకలాపాలు తిరిగి ప్రారంభమయ్యాయి. దీంతో ఆఫీసుకు రావాల్సిందిగా పిలుపొచ్చింది. అయితే, వచ్చేముందు కరోనా పరీక్షలు చేయించుకుని రావాల్సిందిగా కోరడంతో వెళ్లి పరీక్షలు చేయించుకున్న అతడు షాకయ్యాడు.
అతడికి వైరస్ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది. విషయం తెలిసిన అధికారులు 50 రోజులుగా ఇంటికే పరిమితమైన అతడికి కరోనా ఎలా సోకిందని ఆరా తీయగా, పరీక్షలకు వెళ్లే ముందు అతడు ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేసినట్టు తెలిసింది. దీంతో అతడికి అక్కడే వైరస్ సంక్రమించి ఉంటుందని భావిస్తున్నారు. మరోవైపు, అతడు నివసిస్తున్న ప్రాంతంలో రాకపోకలను అధికారులు నిషేధించారు. అతడి కుటుంబ సభ్యులను క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.