USA: హాంకాంగ్ ఇక చైనా అధీనంలోకి... చాలా గట్టిగా స్పందిస్తామన్న యూఎస్!
- హాంకాంగ్ ను స్వాధీనం చేసుకునేందుకు చైనా అడుగులు
- చైనా జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసేందుకు బిల్
- అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత
- అదే నిజమైతే స్పందన చాలా బలంగా ఉంటుందన్న డొనాల్డ్ ట్రంప్
ఆర్థిక, వ్యాపార, పర్యాటక కేంద్రంగా గణనీయమైన ప్రగతిని సాధిస్తున్న హాంకాంగ్ పై పూర్తి పట్టును సాధించే దిశగా చైనా అడుగులు వేసింది. హాంకాంగ్ ను పూర్తిగా ఆక్రమించుకుని, తన ఆధిపత్యాన్ని పెంచుకునే దిశగా, తమకు చెందిన జాతీయ భద్రతా చట్టాన్ని హాంకాంగ్ లో అమలు చేసేందుకు నేడు పార్లమెంట్ లో ప్రత్యేక బిల్లును ప్రవేశపెట్టనుంది. ఇక ఈ బిల్లుకు ఆమోదం పొందడం జీ జిన్ పింగ్ ప్రభుత్వానికి నల్లేరుపై నడకే కాగా, ఇది అమలైతే హాంకాంగ్ లో మరింత సైన్యాన్ని మోహరించి, అక్కడ వెల్లువెత్తుతున్న నిరసనలపై కఠిన నిర్ణయాలు తీసుకుని, వాటిని అణగదొక్కి, తద్వారా అక్కడి కమర్షియల్ కేంద్రాలపై పట్టు సాధించే వీలుంటుంది.
ఇక ఇదే విషయమై చైనా పార్లమెంట్ అధికార ప్రతినిధి జాంగ్ యేసూయీ మాట్లాడుతూ, హాంకాంగ్ లో సైతం జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేస్తామని, అందుకోసం నేషనల్ పీపుల్స్ కాంగ్రెస్ తొలి రోజు సమావేశంలోనే ప్రతిపాదనలు ప్రవేశపెట్టనున్నామని స్పష్టం చేశారు. ఈ బిల్లు ఆమోదం పొందితే, చట్టాలను మరింత సమర్థవంతంగా అమలు చేసే వీలు కలుగుతుందని అన్నారు. ఒక దేశం రెండు వ్యవస్థల విధానాన్ని మరింత మెరుగుపరచాలన్నదే తమ విధానమని, హాంకాంగ్ ఎకానమీని పటిష్టం చేసేందుకు వీలు కలుగుతుందని తెలిపారు.
కాగా, చైనా తీసుకున్న ఈ నిర్ణయాన్ని హాంకాంగ్ లోని ప్రజాస్వామ్య వాదులు తీవ్రంగా తప్పు పడుతుండగా, అమెరికా వారికి మద్దతు పలికింది. తమ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా చైనా నిర్ణయాలు ఉన్నాయని, హాంకాంగ్ స్వాతంత్ర్యానికి ముగింపు పలికేలా చర్యలు వద్దని సివిక్ పార్టీ చట్టసభ ప్రతినిధి డెన్నిస్ వోక్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. తమ దేశ ప్రజలకు చైనా ఏ మాత్రమూ గౌరవం ఇవ్వడం లేదని మరో నేత తాన్యా చాన్ ఆగ్రహాన్ని వెలిబుచ్చారు. తమను, తమ ప్రజలను సంప్రదించకుండానే ఇష్టమొచ్చినట్టుగా చైనా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటోందని, ఇంతటి హేయమైన దాడిపై తమ పోరాటం సాగుతోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, ఈ విషయంలో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన అమెరికా, చైనా, హాంకాంగ్ లలో ఏం జరుగుతూ ఉందో ఎవరికీ తెలియడం లేదని వ్యాఖ్యానించడం గమనార్హం. యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, వస్తున్న వార్తలు నిజమే అయితే, తమ స్పందన చాలా బలంగా ఉంటుందని హెచ్చరించారు. ఇతర దేశాలపై తాము జోక్యం చేసుకోబోమని, ఆసియాకు బొగ్గు గని వంటి హాంకాంగ్ పై చైనా తన నిర్ణయాన్ని అమలు చేస్తే, అంతర్జాతీయ సమాజం నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదని వ్యాఖ్యానించారు.