Jayalalitha: జయలలిత పోయస్ గార్డెన్ బంగళా స్వాధీనం.. సంచలన నిర్ణయం తీసుకున్న తమిళనాడు ప్రభుత్వం!

Tamil Nadu govt to acquire Jayalalithas Poes Garden house

  • బంగళా స్వాధీనానికి వెలువడిన ఆర్డినెన్స్
  • ఆమోదముద్ర వేసిన గవర్నర్ భన్వరీలాల్
  • జయ మెమోరియల్ మ్యూజియంగా మారనున్న బంగళా

తమిళనాడు చరిత్రలో జయలలితది ఒక అధ్యాయం. సినీ నటిగా, రాజకీయవేత్తగా, పురచ్చితలైవిగా ఆమె ఒక వెలుగు వెలిగారు. రాష్ట్రాన్ని కనుసైగలతో శాసించారు. దేశ రాజకీయాల్లో సైతం తనదైన స్పష్టమైన ముద్ర వేశారు. జయ దెబ్బకు కేంద్ర ప్రభుత్వం కూడా కూలిపోయిన సంగతి అందరికీ తెలిసిందే.

 ఉక్కు మహిళ వంటి జయలలితకు చెన్నైలోని తన నివాసం పోయస్ గార్డెన్ లోని 'వేద నిలయం' బంగళా అంటే అమితమైన ఇష్టం. అక్కడి నుంచే ఆమె చక్రం తిప్పారు. ఎన్నో సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. అయితే, ఆమె మరణానంతం ఆమె సన్నిహితురాలు శశికళ కొన్నాళ్లు ఆ బంగళాలో ఉన్నారు. శశి జైలుకు వెళ్లడంతో ప్రస్తుతం ఆ బంగళా ఖాళీగానే ఉంది.

తాజాగా జయ బంగళాపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పోయస్ గార్డెన్ బంగళాను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈరోజు ప్రభుత్వ ఆర్డినెన్స్ వెలువడింది. ఆర్డినెన్స్ పై గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ సంతకం చేశారు. బంగళాను ప్రభుత్వం వశం చేసుకోవడానికి ఆమోద ముద్ర వేశారు.

దీంతో, బంగళాలోని వస్తువులన్నీ యథాతథంగా ప్రభుత్వానికి చెందనున్నాయి. ఈ బంగళాను జయలలిత స్మారక మ్యూజియంగా ప్రభుత్వం తీర్చిదిద్దబోతోంది. మ్యూజియం పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి. ఆమెకు సంబంధించిన ఫొటోలు, వస్తువులు, సమాచారాన్ని ఇందులో భద్రపరచనున్నారు.

  • Loading...

More Telugu News