Chiranjeevi: టాలీవుడ్ లో అందరి తరఫున సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు: చిరంజీవి
- సీఎం కేసీఆర్ తో టాలీవుడ్ పెద్దల భేటీ
- సమావేశం సంతృప్తికరంగా సాగిందన్న చిరంజీవి
- త్వరలోనే పరిశ్రమ పునఃప్రారంభమవుతుందని ఆశాభావం
లాక్ డౌన్ తో నిలిచిపోయిన టాలీవుడ్ కార్యకలాపాలను పునఃప్రారంభించి, ఉపాధి లేక అలమటిస్తున్న సినీ కార్మికులను ఆదుకోవాలని చిత్ర రంగ పెద్దలు భావిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ నుంచి చిరంజీవి, నాగార్జున, రాజమౌళి, దిల్ రాజు, అల్లు అరవింద్ తదితరులు ఈ సాయంత్రం సీఎం కేసీఆర్ ను కలిశారు. ప్రగతి భవన్ లో సానుకూల వాతావరణం మధ్య జరిగిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. దీనిపై చిరంజీవి ట్విట్టర్ లో స్పందించారు.
తెలంగాణ సీఎం కేసీఆర్ కు తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రతి ఒక్కరి తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు వెల్లడించారు. సీఎం కేసీఆర్ తో భేటీ సంతృప్తికరంగా సాగిందని తెలిపారు. సినిమా, టెలివిజన్, డిజిటల్ మీడియా రంగాలకు సంబంధించిన సమస్యలపై సానుకూల ధోరణితో విన్నారని, వేలమంది దినసరి వేతన కార్మికులకు ఊరట కలిగేలా త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారని చిరంజీవి వివరించారు. వినోద పరిశ్రమ పునఃప్రారంభించే విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం రూపొందిస్తుందని, అందరికీ మేలు కలిగేలా చూస్తుందని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని వెల్లడించారు.