Suddala Ashok Teja: సుద్దాల అశోక్ తేజకు 'చిరంజీవి బ్లడ్ బ్యాంక్' రక్తదానం... రేపు కాలేయ మార్పిడి
- అనారోగ్యం పాలైన సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ
- కాలేయ మార్పిడి నిర్వహించాలన్న వైద్యులు
- బి-నెగెటివ్ గ్రూపు రక్తం కోసం ప్రయత్నాలు
జాతీయ స్థాయిలో తెలుగు పాటకు అపూర్వ ఘనత తీసుకువచ్చిన సృజనశీలి సుద్దాల అశోక్ తేజ అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఆయన కాలేయం దెబ్బతినడంతో అత్యవసరంగా కాలేయ మార్పిడి నిర్వహించాలని డాక్టర్లు నిర్ణయించారు. హైదరాబాదు గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో రేపు కాలేయ మార్పిడి జరగనుంది.
అయితే, సుద్దాల అశోక్ తేజకు బి-నెగెటివ్ గ్రూపు రక్తం కావలసివచ్చింది. దీని కోసం ప్రయత్నిస్తున్న తరుణంలో, అశోక్ తేజకు రక్తం ఇచ్చేందుకు చిరంజీవి బ్లడ్ బ్యాంకుకు చెందిన 15 మంది దాతలు ఆసుపత్రికి వెళ్లి రక్తదానం చేశారు. దాంతో ఓ సమస్య తీరినట్టయింది. రేపు ఉదయం ఆయనకు కాలేయ మార్పిడి ప్రక్రియ నిర్వహించేందుకు ఏఐజీ వైద్యులు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి బ్లడ్ బ్యాంకు తరఫున రవణం స్వామినాయుడు దాతలందరికీ ఆత్మీయతాభినందనలు తెలియజేశారు. చిరంజీవిగారి పిలుపుకు వెంటనే స్పందిస్తున్న మెగా బ్లడ్ బ్రదర్స్ కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.