oxford university: రెండో విడత పరీక్షలకు ఆక్స్‌ఫర్డ్ టీకా!
- తొలి విడతలో వెయ్యి మందిపై పరీక్ష
- రెండో విడతలో 10 వేల మందికిపైగా టీకా
- బాధితులకు ఎంత వరకు రక్షణ కల్పిస్తుందనేది పరిశీలన
ఆక్స్‌ఫర్డ్ టీకా ఆశలు రేకెత్తిస్తోంది. గత నెలలో తొలి విడతగా వెయ్యి మందిపై ఈ వ్యాక్సిన్ పరీక్షించగా విజయవంతం కావడంతో రెండో విడత పరీక్షలకు ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం సిద్ధమైంది. ఈ విడతలో దేశవ్యాప్తంగా 10,260 మందిపై టీకాను పరీక్షించనున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు.
తొలి విడతలో ఈ టీకా ఎంత వరకు సురక్షితమన్నది పరిశీలించిన శాస్త్రవేత్తలు.. ఈ దశలో ఈ టీకా వల్ల వృద్ధుల్లో రోగ నిరోధక వ్యవస్థ స్పందన ఎలా ఉంది? బాధితులకు ఇది ఎంత వరకు రక్షణ కల్పిస్తుంది? అన్న విషయాలను పరిశీలించనున్నట్టు ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్ గ్రూప్ అధిపతి ఆండ్రూ పొలార్డ్ తెలిపారు. కాగా, టీకా పరీక్షలు విజయవంతంగా రెండో దశలోకి అడుగుపెట్టడంపై అందరిలోనూ ఆశలు రేకెత్తుతున్నాయి.