Ivanka Trump: తండ్రిని 1,200 కి.మీ దూరం సైకిల్ పై తీసుకెళ్లిన బాలికపై ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు
- 7 రోజుల పాటు సైకిల్ తొక్కింది
- ఆమెకు ఎంతో ఓర్పు, ప్రేమ ఉన్నాయి
- భారతీయ ప్రజలు, సైకిల్ ఫెడరేషన్‌ను ఆకర్షించింది
ఓ భారతీయ బాలికపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూతురు ఇవాంకా ట్రంప్ ప్రశంసల జల్లు కురిపించారు. లాక్డౌన్ నేపథ్యంలో సొంత గ్రామానికి వెళ్లే క్రమంలో గాయపడిన తన తండ్రిని ఓ బాలిక (15) సైకిల్‌పై ఎక్కించుకుని 1,200 కిలోమీటర్లు ప్రయాణించిన విషయం తెలిసిందే. బీహార్‌లోని దర్భాంగకు చెందిన ఓ వ్యక్తి ఉపాధి కోసం ఢిల్లీలో తన కూతురితో కలిసి నివసిస్తుండగా లాక్‌డౌన్‌తో తీవ్ర ఇబ్బందులు రావడంతో సొంతూరికి వెళ్లే క్రమంలో గాయపడ్డాడు. దీంతో తండ్రిని సైకిల్ ఎక్కించుకుని ఆమె సొంతూరికి వచ్చింది.
ఇందుకు సంబంధించిన వార్తను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసిన ఇవాంక.. '15 ఏళ్ల జ్యోతి కుమారి అనే బాలిక గాయపడిన తన తండ్రిని సైకిల్‌పై కూర్చోబెట్టి 7 రోజుల పాటు సైకిల్ తొక్కుతూ 1200 కిలోమీటర్ల ప్రయాణం చేసింది. ఎంతో ఓర్పు, ప్రేమతో ఆమె చేసిన ఈ అద్భుతమైన పని భారతీయ ప్రజలు, సైకిల్ ఫెడరేషన్‌ను ఆకర్షించింది' అని ఆమె తెలిపింది.
కాగా, సైక్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా జ్యోతి ప్రతిభను ప్రశంసించి, సైక్లింగ్ ట్రయల్స్‌కు రావాల్సిందిగా ఆమెను ఆహ్వానించింది. ఆమె ట్రయల్స్‌లో ఎంపికైతే, ట్రైనీగా అవకాశం ఇచ్చి, ఆ తర్వాత ఆమెకు పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తారు.