Mark Zukergerg: కరోనా కమ్ముకొచ్చిన వేళ... సంపదను పెంచుకున్న కుబేరులు!
- పాతాళానికి పడిపోయిన ఆర్థిక వృద్ధి
- టెక్నాలజీ కంపెనీలకు వరంగా మారిన లాక్ డౌన్
- అందరూ ఇళ్లలోనే ఉండటంతో లాభాలు
కరోనా మహమ్మారి యావత్ ప్రపంచాన్నీ అతలాకుతలం చేసి, ఆర్థిక వృద్ధిని పాతాళానికి పడదోసిన వేళ, ప్రపంచ కుబేరులు మాత్రం తమ సంపదను మరింతగా పెంచుకున్నారు. అమెరికా జీడీపీ మందగమనంలో ఉందని యూఎస్ ఫెడ్ ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలో టెక్ దిగ్గజాలు ఫేస్ బుక్, అమెజాన్ చీఫ్ లు భారీ లాభాలను నమోదు చేసుకున్నారు. మార్క్ జుకర్ బర్గ్, జెఫ్ బెజోస్ ల సంపద ఏకంగా 45 శాతం వరకూ పెరగడం గమనార్హం.
గడచిన రెండు నెలల కాలంలో... అంటే, కరోనా వెలుగులోకి వచ్చిన తరువాత, టెక్నాలజీ ఆధారిత కంపెనీల ఈక్విటీ విలువ దూసుకెళ్లింది. జెఫ్ బెజోస్ సంపద 30 శాతం పెరిగి 147 బిలియన్ డాలర్లకు పైగా చేరుకోగా, జుకర్ బర్గ్ ఆస్తి విలువ 45 శాతం పెరిగి 80 బిలియన్ డాలర్లను దాటింది.
ప్రపంచంలోని అత్యధిక దేశాల్లో లాక్ డౌన్ విధించడంతో ప్రజలు ఇళ్లకే పరిమితమైన వేళ, క్లౌడ్ బిజినెస్ ఊపందుకోవడం, వీడియో కాన్ఫరెన్స్ లు అధికంగా జరగడం, గేమింగ్ వ్యాపారం పెరగడం తదితర కారణాలతో అమెజాన్, ఫేస్ బుక్ సంస్థలు లాభాల్లో పరుగులు పెట్టాయి. కరోనా కారణంగా టెక్నాలజీ కంపెనీలను నడుపుతున్న దాదాపు 600 మంది తమ సంపదను పెంచుకున్నారని ఇనిస్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ ప్రోగ్రామ్ ఫర్ ఈక్వాలిటీ గణాంకాలు చెబుతున్నాయి.
600 మంది టెక్ బిలియనీర్ల సంపద మార్చి 18 నుంచి మే 19 మధ్య ఏకంగా 434 బిలియన్ డాలర్లకు పైగా పెరిగింది. మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్, లెజండరీ ఇన్వెస్టర్ వారెన్ బఫెట్ లు కూడా లాభాలను నమోదు చేసినప్పటికీ, వారి లాభాల శాతం వరుసగా 8.2, 0.8 శాతం మాత్రమే ఉండటం గమనార్హం.