aiims: అవిభక్త కవలలకు 24 గంటల పాటు ఆపరేషన్.. విజయవంతంగా వేరు చేసిన వైద్యుల బృందం!
- ఢిల్లీలోని ఎయిమ్స్‌లో శస్త్రచికిత్స
- విజయవంతమైందన్న వైద్యులు
- మొన్న ఉదయం 8:30 నుంచి నిన్న ఉదయం 9 గంటల వరకు ఆపరేషన్
పొత్తికడుపు, వెన్నెముక, పేగులు కలిసిపోయి పుట్టిన అవిభక్త కవలలను ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వైద్యులు 24 గంటల పాటు ఆపరేషన్ చేసి వేరు చేశారు. ఆ కవలలకు చేసిన ఆపరేషన్ విజయవంతమైందని వైద్యులు ప్రకటించారు. ఈ సర్జరీలో 64 మంది వైద్యులు పాలుపంచుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్‌కు చెందిన భార్యాభర్తలకు అవిభక్త కవలలు జన్మించారు. ఇప్పుడు వారికి రెండేళ్ల వయసు ఉంటుంది. దీంతో ఢిల్లీలోని ఎయిమ్స్‌లో వారిని ఆపరేషన్ కోసం చేర్పించారు. ఆ అవిభక్త ఆడ శిశువుల గుండె, రక్త నాళాల్లోనూ సమస్యలు ఉండడంతో చాలా క్లిష్టమైన ఆపరేషన్ చేశారు.
ఈ ఆపరేషన్ శుక్రవారం ఉదయం 8:30 గంటల నుంచి శనివారం ఉదయం 9 గంటల వరకు జరిగిందని వైద్యులు చెప్పారు. ఈ ఆపరేషన్‌లో సర్జన్లు, అనస్థీషియా నిపుణులు, ప్లాస్టిక్ సర్జన్లు పాల్గొన్నారు. ఆ శిశువుల హృదయాల్లో రంధ్రాలు ఉండడంతో సర్జరీ మరింత కష్టతరమైందని, వారికి మత్తుమందు ఇవ్వడం వంటి చికిత్సలు చాలా జాగ్రత్తగా చేయాల్సి వచ్చిందని వైద్యులు చెప్పారు.
మత్తుమందు ఇచ్చినప్పుడు వారి గుండె సాధారణంగా పనిచేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆపరేషన్‌లో భాగంగా వెన్నెముకను, తొడలోని రక్తనాళాలకు సంబంధించిన అన్ని చికిత్సలను పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ బాలికలు వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు.