Wuhan: వైరస్ పై మేం ఎలాంటి పరిశోధనలు నిర్వహించలేదు... ఎలా లీకవుతుంది?: వుహాన్ ల్యాబ్
- వుహాన్ ల్యాబ్ నుంచే కరోనా లీకైందన్న అమెరికా
- అమెరికా వన్నీ కట్టుకథలంటూ కొట్టిపారేసిన వుహాన్ ల్యాబ్ డైరెక్టర్
- ఇలాంటి వైరస్ ఉంటుందని తమకు తెలియదని వివరణ
యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్ పుట్టింది వుహాన్ లో అన్న సంగతి తెలిసిందే. అయితే వుహాన్ లోని వైరాలజీ ల్యాబ్ నుంచే ఈ వైరస్ లీక్ అయ్యిందంటూ అమెరికా కొంతకాలంగా ఆరోపణలు చేస్తోంది. దీనిపై వుహాన్ ల్యాబ్ డైరెక్టర్ వాంగ్ యాన్ యీ గట్టిగా స్పందించారు.
అమెరికా ఆరోపణల్లో నిజంలేదని, అమెరికా కల్పిత గాథలు వినిపిస్తోందని స్పష్టం చేశారు. ఇలాంటి వైరస్ ఉందన్న విషయం కూడా తమకు తెలియదని, అలాంటప్పుడు ఏ విధంగా పరిశోధన చేస్తామని అన్నారు. మాకు తెలియని వైరస్ ను ఏ విధంగా ల్యాబ్ లో ఉంచుతాం, అది ఏ విధంగా లీకవుతుంది? అని వాంగ్ యాన్ యీ ప్రశ్నించారు. తమ ల్యాబ్ లో ఉన్న వైరస్ లలో కొన్ని గబ్బిలాల ద్వారా వ్యాప్తి చెందుతాయని, కానీ ఆ వైరస్ ల జన్యుక్రమంతో కరోనా వైరస్ కు పోలికేలేదని స్పష్టం చేశారు.