Udhav Thackeray: ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించడం ఎంత తప్పో... ఒక్కసారిగా ఎత్తేసినా అంతే తప్పు: ఉద్ధవ్ థాకరే
- కరోనా కట్టడి కోసం దేశంలో లాక్ డౌన్ విధింపు
- ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేయలేని పరిస్థితి వచ్చిందన్న మహా సీఎం
- రుతుపవనాల సీజన్ లో మరింత అప్రమత్తంగా ఉండాలని వెల్లడి
దేశంలో లాక్ డౌన్ విధించి రెండు నెలలు అయింది. కరోనా కేసులు మాత్రం నిత్యం అత్యధిక సంఖ్యలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు లాక్ డౌన్ కొనసాగుతుండగానే, సడలింపులు సైతం అమలవుతున్నాయి. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే స్పందించారు. దేశంలో కరోనాను కట్టడి చేసేందుకు ఒక్కసారిగా లాక్ డౌన్ ప్రకటించడం ఓ తప్పిదం అని వ్యాఖ్యానించారు. ఇప్పుడు దేశంలో ఒక్కసారిగా మొత్తం లాక్ డౌన్ ను ఎత్తేయడానికి వీల్లేని పరిస్థితి వచ్చిందని అన్నారు.
దేశంలో ఇప్పటికీ కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో, ఉన్నపళాన లాక్ డౌన్ ప్రకటించడం ఎంత తప్పో, ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తేసినా అంతే తప్పు అని వ్యాఖ్యానించారు. అలాంటి నిర్ణయాలు మన ప్రజలను రెండందాలా దెబ్బతీస్తాయని థాకరే పేర్కొన్నారు. రాబోయేది రుతుపవనాల కాలం కావడంతో కరోనా వ్యాప్తి పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.