Kiran Rijiju: ఐపీఎల్ ఎప్పుడు జరిగేది నిర్ణయించేది కేంద్రమే... బీసీసీఐ కాదు: కేంద్ర క్రీడల మంత్రి
- లాక్ డౌన్ కారణంగా వాయిదాపడిన ఐపీఎల్
- అక్టోబరు, నవంబరులో నిర్వహించాలనుకుంటున్న బీసీసీఐ
- ప్రజల ఆరోగ్యానికి ముప్పు లేనప్పుడే అనుమతి ఉంటుందన్న కేంద్ర మంత్రి
కరోనా వ్యాప్తి కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తాజా సీజన్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. పరిస్థితులు అనుకూలిస్తే అక్టోబరులో లేదా నవంబరులో ఐపీఎల్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తోంది.
అయితే, ఐపీఎల్ ఎప్పుడు జరపాలో నిర్ణయించేది కేంద్ర ప్రభుత్వం అని, బీసీసీఐ కాదని కేంద్ర క్రీడల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు. అది కూడా దేశంలో కరోనా పరిస్థితుల ఆధారంగానే కేంద్రం నిర్ణయం ఉంటుందని అన్నారు. ప్రజల ఆరోగ్యానికి ముప్పు లేదని భావించినప్పుడే కేంద్రం ఐపీఎల్ కు ఆమోదం తెలుపుతుందని తెలిపారు. కీడ్రా పోటీలు నిర్వహించడం కోసం దేశ ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టలేమని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం తమ దృష్టంతా కరోనాతో పోరాడడంపైనే ఉందని వెల్లడించారు.