New York: హమ్మయ్య! న్యూయార్క్ కోలుకుంటోంది... ఇన్నాళ్లకు 100 లోపు మరణాలు!
- ఇవాళ న్యూయార్క్ లో కరోనా మృతుల సంఖ్య 84
- ఏప్రిల్ 8న గరిష్టంగా 799 మరణాలు
- ఇప్పటివరకు నిత్యం 100కు తగ్గని మృతుల సంఖ్య
న్యూయార్క్ నగరంలో కరోనా వైరస్ సృష్టించిన కల్లోలం మరే నగరంలోనూ సృష్టించలేదంటే అతిశయోక్తి కాదు. నిత్యం వేలల్లో పాజిటివ్ కేసులు, వందల్లో మరణాలతో న్యూయార్క్ అతలాకుతలమైంది. అమెరికా దేశం మొత్తమ్మీద ఈ మహానగరంలోనే అత్యధిక కేసులు వెల్లడయ్యాయి. ఇప్పటివరకు అక్కడ 1.97 లక్షల మందికి కరోనా సోకగా, 16,149 మంది మృత్యువాత పడ్డారు. అయితే, ఇప్పుడక్కడ పరిస్థితి క్రమంగా కుదుట పడుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి.
చాన్నాళ్ల తర్వాత మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టింది. ఇవాళ కనిష్టంగా 84 మంది చనిపోయారు. ఏప్రిల్ 8న ఏకంగా 799 మంది మరణించడం న్యూయార్క్ నగర చరిత్రలో ఓ రికార్డుగా నిలిచిపోయింది. ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు ఏ రోజూ 100 మరణాలకు తగ్గిందిలేదు. ఇవాళ తొలిసారిగా వంద లోపు మరణాలు రావడమే న్యూయార్క్ అధికార యంత్రాంగానికి ఓ చిన్నపాటి విజయం దక్కినట్టు భావించాలి.