Smriti Irani: సినీ నటుడికి థ్యాంక్స్ చెప్పిన కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ
- వలస కార్మికులను సొంత ఖర్చులతో తరలిస్తున్న సోనూ సూద్
- గర్విస్తున్నాను అంటూ స్మృతి వ్యాఖ్యలు
- చేతులెత్తి నమస్కరిస్తున్నానంటూ ట్వీట్
కరోనా రక్కసి కారణంగా భారత్ లో ఎక్కువగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది వలస కార్మికులే! వారి వెతలు సినీ నటుడు సోనూ సూద్ ను విపరీతంగా కదిలించాయి. అందుకే ఆయన స్వంత ఖర్చులతో బస్సులు ఏర్పాటు చేసి వలస కార్మికులను వారి స్వస్థలాలకు తరలించే బృహత్ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ట్విట్టర్ లో ఎవరు సాయం కోరినా వెంటనే స్పందిస్తూ మానవతా దృక్పథం ప్రదర్శిస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ స్పందించారు. ఆపదలో ఎంతోమందికి అండగా నిలుస్తున్నారంటూ సోనూ సూద్ కు కృతజ్ఞతలు తెలిపారు.
"సోనూ సూద్, నటనా రంగ సహచరుడిగా మీ గురించి రెండు దశాబ్దాలుగా తెలుసు. అది ఓ గౌరవంగా భావిస్తాను. మీరు నటుడిగా ఎదగడం పట్ల సంతోషించాను. కానీ ఇప్పటి విపత్కర పరిస్థితులు సవాళ్లు విసురుతున్న సమయంలో మీరు చూపిస్తున్న సానుభూతి నన్ను ఇప్పటికీ గర్వపడేలా చేస్తోంది. అవసరంలో ఉన్న వారిని ఆదుకుంటున్న మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా" అంటూ స్మృతి ట్వీట్ చేశారు.