Domestic Flights: మళ్లీ విమాన ప్రయాణాలు షురూ.. పూణెలో ల్యాండ్ అయిన తొలి విమానం!

Domestic Flight services resume today

  • లాక్‌డౌన్ కారణంగా రెండు నెలలపాటు గ్రౌండ్‌కే పరిమితమైన విమానాలు
  • పకడ్బందీ ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
  • విమానాశ్రయాలకు చేరుకునేందుకు ప్రయాణికుల పాట్లు

కరోనా వైరస్ లాక్‌డౌన్  కారణంగా దాదాపు రెండు నెలలపాటు గ్రౌండ్‌కే పరిమితమైన దేశీయ విమానాలు మళ్లీ ఎగరడం మొదలెట్టాయి. ప్రభుత్వ సడలింపుల్లో భాగంగా గత అర్ధరాత్రి నుంచి దేశీయ విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో టేకాఫ్ అయిన విమానం ఉదయం పూణె విమానాశ్రయంలో ల్యాండ్ అయింది.

విమాన సర్వీసులను పునరుద్ధరించిన ప్రభుత్వం అందుకోసం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ప్రయాణికులు విమానాశ్రయంలోకి చేరుకున్న వెంటనే థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. అందరూ మాస్కులు ధరించేలా చర్యలు తీసుకున్నారు. భౌతిక దూరాన్ని అమలు చేశారు. సిబ్బంది కూడా పూర్తిస్థాయి రక్షణ కిట్లు ధరించి విధులకు హాజరయ్యారు.

రైలు టికెట్లు బుక్ చేసుకోవడంలో విఫలమైన వారే తొలి విడత ప్రయాణంలో ఎక్కువ మంది ఉన్నట్టు తెలుస్తోంది. ప్రయాణికుల్లో ఎక్కువగా పారామిలటరీ సిబ్బంది, సైనిక దళాలకు చెందిన వారు, విద్యార్థులు, వలస కార్మికులు ఉన్నట్టు తెలుస్తోంది. విమాన సర్వీసులు ప్రారంభమైనా ఎయిర్‌పోర్టుకు చేరుకునేందుకు స్థానికంగా ఎటువంటి సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఒక్క ఆంధ్రప్రదేశ్, పశ్చిమ బెంగాల్ మినహా దేశవ్యాప్తంగా విమాన సేవలు ప్రారంభమయ్యాయి. ఏపీలో బుధవారం నుంచి, పశ్చిమ బెంగాల్‌లో గురువారం నుంచి సేవలు ప్రారంభం కానున్నాయి.

  • Loading...

More Telugu News