Kanna Lakshminarayana: ప్రొఫైల్ పిక్‌లు మార్చండి.. రాష్ట్రవ్యాప్త నిరసనల్లో పాల్గొనండి: టీటీడీ ఆస్తుల వేలంపై కన్నా లక్ష్మీ నారాయణ పిలుపు
- భక్తులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు మీకెవరిచ్చారు?
- ఇంటి వద్ద బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు "నిరసనదీక్ష" చేపట్టాలి
- టీటీడీ భూములను విక్రయించడం మనోభావాలను అవమానించడమే
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ మండిపడుతూ.. జీవో 39, తిరుమల తిరుపతి దేవస్థానం, సింహాచలం భూముల రక్షణ కోసం పోరాటం చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. దీనిపై రేపు నిరసనలు చేపడతామని ప్రకటించారు.
'తిరుమల వెంకన్నకు భక్తులు ఇచ్చిన భూములను అమ్మే హక్కు మీకెవరిచ్చారని వైసీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ, ప్రభుత్వ వైఖరికి నిరసనగా.. రేపు రాష్ట్ర వ్యాప్తంగా వెంకన్న భక్తులు, బీజేపీ శ్రేణులు, హిందూ సంస్థలు ఉ.10 గంటల నుండి సా.5 గంటల వరకు తమ ఇంటి వద్ద "నిరసనదీక్ష" చేపట్టాలి' అని ఆయన పిలుపునిచ్చారు.
టీటీడీ భూములను వైసీపీ ప్రభుత్వం విక్రయించడం హిందూ మనోభావాలను దారుణంగా అవమానించడమేనని కన్నా లక్ష్మీ నారాయణ అన్నారు. సోషల్ మీడియాలో మన ప్రొఫైల్ పిక్చర్ ని మార్చడం ద్వారా ఈ హిందూ వ్యతిరేక నిర్ణయంపై పోరాడటానికి నాంది పలకాలని ప్రతి ఒక్కరికి తాను విజ్ఞప్తి చేస్తున్నానని ఆయన చెప్పారు. కాగా, తన ప్రొఫైల్ పిక్‌ను మార్చేసిన కన్నా లక్ష్మీ నారాయణ శ్రీవారి ఫొటో పెట్టుకున్నారు.