Bandaru Sathyanarayana Murthy: వాళ్లకి జైలు జీవితం అలవాటే, మీరే ఆలోచించుకోవాలి: సవాంగ్, నీలం సాహ్నీలకు టీడీపీ నేత బండారు సలహా
- ఏపీ సర్కారుకు హైకోర్టులో ఎదురుదెబ్బలు
- ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ చూడలేదన్న బండారు
- అధికారులను భ్రష్టుపట్టిస్తున్నారని విమర్శలు
ఇటీవల కాలంలో ఏపీ ప్రభుత్వానికి రాష్ట్ర హైకోర్టులో వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్న సంగతి తెలిసిందే. దీనిపై టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ మూర్తి ఘాటుగా స్పందించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద సంఖ్యలో కోర్టు తీర్పులు రావడం ఎన్నడూలేదని బండారు వ్యాఖ్యానించారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఈ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆరోపించారు. ఇప్పుడు యెస్ అంటున్న అధికారులు ఆ తర్వాత కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందని అన్నారు.
జగన్, విజయసాయిరెడ్డికి జైలు జీవితం అలవాటేనని, కానీ గౌతం సవాంగ్, నీలం సాహ్నీలే తమ పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలని హితవు పలికారు. సజ్జల రామకృష్ణారెడ్డి తయారుచేస్తున్న జీవోలపై నీలం సాహ్నీ గుడ్డిగా సంతకాలు చేస్తున్నారని విమర్శించారు. గతంలో కీలక పదవుల్లో ఉన్న కొందరు ఐఏఎస్ లు ఇప్పుడు కోర్టుల చుట్టూ ఎలా తిరుగుతున్నారో తెలియదా? అని ప్రశ్నించారు. డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో సీబీఐ విచారణ వేయడం అంటే పోలీసుల ప్రతిష్ఠ దిగజారినట్టు కాదా? అని నిలదీశారు.