Supreme Court: వాణిజ్య విమానయాన సంస్థలపై చూపుతున్న శ్రద్ధ ప్రజలపై చూపితే బాగుంటుంది... కేంద్రానికి సుప్రీం హితవు
- వందేభారత్ మిషన్ పేరిట విదేశాల నుంచి భారతీయుల తరలింపు
- విమానాల్లో మధ్య సీట్లలోనూ ప్రయాణికులతో భర్తీ
- జూన్ 6 తర్వాత ఆ విధంగా కుదరదన్న సుప్రీం
విదేశాల్లో ఉన్న భారతీయులను వందేభారత్ మిషన్ పేరిట కేంద్రం మే 7వ తేదీ నుంచి భారత్ తీసుకువస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భౌతికదూరం నిబంధనలు పాటించడం లేదంటూ సుప్రీం కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
వాణిజ్య విమానయాన సంస్థలపై చూపిస్తున్న శ్రద్ధ ప్రజల ఆరోగ్యంపై చూపిస్తే బాగుంటుందని అత్యున్నత న్యాయస్థానం హితవు పలికింది. "ప్రభుత్వాలు ఎప్పుడైనా ప్రజల ఆరోగ్యంపై ఆందోళన చెందాలి. కానీ విమానయాన సంస్థల పరిస్థితిపై ఆందోళన చెందుతున్నట్టుంది" అంటూ వ్యాఖ్యానించింది.
విమానాల్లో ప్రయాణికులను కూర్చోబెడుతున్న తీరును సీజేఐ జస్టిస్ ఎస్ఏ బోబ్డే ప్రశ్నించారు. మధ్య సీట్లను ఖాళీగా ఉంచకుండా, అందులోనూ ప్రయాణికులను కూర్చోబెట్టడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. బహిరంగ ప్రదేశాల్లో 6 అడుగుల భౌతికదూరం పాటించాలంటున్నారు, మరి విమానాల్లో ఏ విధంగా పాటిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్రం తరఫున వాదనలు వినిపించారు. మధ్య సీట్లు వదిలేయడం కంటే కరోనా టెస్టులు, క్వారంటైన్ విధానాలు అత్యుత్తమం అని నిపుణులు చెప్పిన మేరకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.
దాంతో, న్యాయస్థానం స్పందిస్తూ, విమాన ప్రయాణికులకు ఏ విధంగా వైరస్ సంక్రమించదో చెప్పాలని అడిగింది. ఇప్పటికే జూన్ 6 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని తుషార్ మెహతా విన్నవించగా, ఆ తర్వాత మాత్రం మధ్య సీట్లు ఖాళీగా వదిలేయాల్సిందేనని సుప్రీం గట్టిగా చెప్పింది. నేటి నుంచి దేశీయ విమాన సర్వీసులు షురూ అయిన నేపథ్యంలో, మధ్య సీట్ల సమస్యపై రాష్ట్రాల హైకోర్టులు జూన్ 2న విచారించవచ్చని పేర్కొంది.